ఇక భూవివాదాలు పరిష్కారం
ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి
కంగ్టి(నారాయణఖేడ్): భూ వివాదాలకు భూ భారతి రీ–సర్వే మంచి పరిష్కారమని ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి పేర్కొన్నారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా కంగ్టి మండలంలోని రాసోల్, మనూర్ మండలంలోని ముగ్దుంపూర్ గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. రాసోల్‌లో గురువారం నిర్వహించిన భూసర్వే గ్రామసభలో ఆమె పాల్గొని మాట్లాడారు. గతంలో 1931లో భూముల సర్వే నిర్వహించగా దాదాపు వందేళ్ల తర్వాత సర్వే చేయడం ఇక్కటి రైతుల అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలోని అన్నీ సర్వే నంబర్లు రీసర్వే చేయడంతోపాటు సబ్ నంబర్లు సైతం సర్వే చేసి రైతులకు హద్దులు చూపడంతో సమస్యల పరిష్కారం సులువుగా అవుతుందన్నారు. భూ రీ సర్వేకు రైతులందరు సహకరించాలని కోరారు. గ్రామసభ కార్యక్రమంలో అధ్యక్షురాలు రాజవ్వ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ భిక్షపతి, తహసీల్దార్ షేక్ అహ్మద్ అబ్దుల్, సర్వే బృంద సభ్యులు, రెవెన్యూ సిబ్బంది స్థానిక రైతులు పాల్గొన్నారు.


