రీసర్వేకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

రీసర్వేకు శ్రీకారం

Feb 27 2026 10:50 AM | Updated on Feb 27 2026 10:50 AM

రీసర్వేకు శ్రీకారం

రీసర్వేకు శ్రీకారం

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : భూముల రీ సర్వేకు రెవెన్యూశాఖ శ్రీకారం చుట్టింది. పైలలలలట్‌ ప్రాజెక్టు కింద సంగారెడ్డి జిల్లాలో 17 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేశారు. మొదటి విడతలో బాబిల్‌గ్రాం (సదాశివపేట మండలం), ముస్తాఫాపూర్‌ (రాయికోడ్‌), రసోలీ (కంగ్టి), ముగ్దంపూర్‌ (మానూరు) గ్రామాలను ఎంపిక చేశారు.

మెదక్‌ జిల్లాలో 24 గ్రామాలను గుర్తించారు. విలేజ్‌ మ్యాపులు అందుబాటులో లేని గ్రామాలను ముందుగా ఎంపిక చేశారు. ఆయా గ్రామాల పరిధిలో ఉన్న భూములన్నింటినీ ఇప్పుడు రీ సర్వే చేస్తున్నారు. ఇందుకోసం సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డుల శాఖకు సంబంధించిన ఉద్యోగులతోపాటు, కొందరు లైసెన్డ్‌ సర్వేయర్లను నియమించి ఈ ప్రక్రియను చేపట్టారు. ఆయా గ్రామాల్లో గ్రామసభలను నిర్వహిస్తున్నారు. సర్వే చేయడం ద్వారా ఉపయోగాలను పట్టాదారులకు వివరిస్తున్నారు. ఆధునిక సాంకేతికతతో కూడిన డీజీపీఎస్‌ (డిజిటల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం) విధానం కంటే ఇంకా అడ్వాన్డ్‌ టెక్నాలజీ జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్‌ విధానంలో ఈ సర్వే చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రానికి అధికారులు వెళ్లి అక్కడ సర్వే విధానం, భూమి రికార్డుల నిర్వహణపై అధ్యయనం చేసి వచ్చారు. అదేవిధానంలో ఇప్పుడు జిల్లాలో రీసర్వే చేపట్టారు.

శిథిలావస్థకు చేరుకుని.. చిరిగిపోయి..

రెవెన్యూ రికార్డులు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని చిరిగిపోయాయి. వందేళ్ల కిత్రం నాటి రికార్డులు కావడంతో చాలా రికార్డులు పట్టుకోవడానికి కూడా వీలులేనంతగా తయారయ్యాయి. కొన్ని గ్రామాలకు అసలు గ్రామ నక్షాలు లేవు. టీపన్లు, శేత్వార్లు కూడా అందుబాటులో లేవు. దీంతో భూవివాదాలు ఏర్పడినప్పుడు వాటిని పరిష్కరించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్రామాల వారీగా భూములు రీ సర్వే చేయడం ద్వారా ఈ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సర్వే చేస్తే డిజిటలైజ్డ్‌ విలేజ్‌ మ్యాపులు, కొత్త టీపన్లు, శేత్వార్‌లను రూపొందిస్తారు.

బై నంబర్లకు స్వస్తి

సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న సర్వే నంబర్ల స్థానంలో కొత్త సర్వేనంబర్లు ఆయా భూములకు కేటాయిస్తారు. ఇకపై ఒక సర్వే నంబర్‌కు బై నంబర్లు వేసే పద్ధతికి స్వస్తి చెబుతారు. ఒకే సీరిస్‌లో సర్వే నంబర్లు కేటాయిస్తారు. అలాగే ఆయా గ్రామాలకు విలేజ్‌ మ్యాపులను రూపొందిస్తారు.

కొత్త సర్వే నంబర్లు.. సబ్‌ డివిజన్‌ మ్యాపులుతొలి విడతలో మ్యాపులు లేని గ్రామాలు ఎంపిక సంగారెడ్డి జిల్లాలో 17 గ్రామాలు,మెదక్‌లో 24 గ్రామాలు ఎంపిక ఆధునిక సాంకేతికత జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్‌ విధానంలో సర్వే గ్రామ సభలు నిర్వహిస్తున్న రెవెన్యూశాఖ

అవగాహన కల్పిస్తున్నాం..

రీ సర్వే చేయడం ద్వారా జరిగే ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రోవర్‌ విధానాన్ని ఉపయోగించి ఈ సర్వే చేస్తున్నాం. ఈ సర్వే పూర్తయితే సమగ్ర భూరికార్డులు అందుబాటులో ఉంటాయి. భూసమస్యల పరిష్కారం చాలా సులభమవుతుంది. ఈ సర్వేకు పట్టాదారులు సహకరించాలి.

– ఐనేష్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌,

సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డుల శాఖ

సబ్‌ డివిజన్‌లు సైతం..

ఏదైనా ఒక సర్వే నంబర్‌లో భూమిని ఇప్పటివరకు ఒకే రికార్డు అందుబాటులో ఉంది. ఆయా సర్వే నంబర్‌లో కొంత భాగం ఇతరులకు క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. కానీ రికార్డుల్లో మాత్రం సర్వే నంబర్‌ మొత్తం ఒకే మ్యాపుగా ఉంటుంది. చాలా మట్టుకు పెద్ద సర్వే నంబర్‌లు సబ్‌ డివిజన్‌లు జరగలేదు. అలాగే పట్టాదారుకు సంబంధించి ఇద్దరు, ముగ్గురు వారసులు ఉంటే పంచుకున్న భూమికి సంబంధించి ప్రత్యేకంగా మ్యాపులను తయారు చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement