కాంగ్రెస్‌కు ఓటేస్తే 3 గంటల కరంటే..! | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ఓటేస్తే 3 గంటల కరంటే..!

Published Sat, Nov 18 2023 7:48 AM

- - Sakshi

సంగారెడ్డి(గజ్వేల్‌): కాంగ్రెస్‌కు ఓటేస్తే 3 గంటల కరంటే ఉంటుందని వైద్యారోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. కుకునూరుపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన రోడ్‌ షో సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి మూడు గంటల కరెంటు సరిపోతుందంటూ కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఎరువుల కోసం దుకాణాల వద్ద చెప్పులను క్యూలో పెట్టిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. బిందెడు తాగునీళ్ల కోసం దూరం వెళ్లి తెచ్చుకున్నప్పుడు భుజాలు కాయలు కాసిన విషయం వాస్తవం కాదా అని అన్నారు.

తెలంగాణలో మహా అయితే ఒకటి రెండు చోట్ల గెలిచే బీజేపీ నేత గజ్వేల్‌లో ఓట్లు దండుకునేందుకు బీసీని సీఎం చేస్తామంటూ చెబుతున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ను తిప్పలు పెట్టేందుకు ఢిల్లీ నుంచి డబ్బుల సంచులతో బీజేపీ నాయకులు బయలు దేరారన్నారు. అవసరం కోసం దగ్గరికి వచ్చే కాంగ్రెస్‌, బీజేపీలు కావాలో.. ప్రజల ఆపద, సంపదల్లో పాలుపంచుకుంటున్న సీఎం కేసీఆర్‌ కావాలో ఆలోచించాలన్నారు.

కరోనా కష్ట కాలంలో ఎక్కడ పోయారో ఓట్లు అడుగడానికి వచ్చే ప్రతిపక్ష పార్టీలను అడుగాలన్నారు. రూ.14 వేల కోట్లతో రైతు రుణాలు మాఫీ చేశామని, ఎన్నికల కోడ్‌ నేఫథ్యంలో పెండింగ్‌లో ఉన్న రూ.4వేల కోట్ల రుణమాఫీ ప్రక్రియను ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రాగానే పూర్తి చేసి తిరిగి రుణాలు అందేలా చూస్తామన్నారు. రాష్ట్రంలో 13లక్షల2వేల 53 మంది కల్యాణ లక్ష్మి పథకంలో లబ్ధిపొందారన్నారు.

ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లు లేని పేదలందరికీ ఇంటి స్థలంతో పాటు డబుల్‌ బెడ్‌ రూంలను కట్టించి ఇచ్చే బాధ్యత తనదేనన్నారు. తెలంగాణ సంపదను పెంచి పథకాల రూపాల్లో పేదలకు పంచుతామన్నారు. 24 గంటల పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దేవి రవిందర్‌, నాయకులు పొల్కంపల్లి నరేందర్‌, కోల సద్గుణ, పిస్క అమరేందర్‌, మల్లం ఐలయ్య, లక్ష్మన్‌రాజు, భూములుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: ఈటలకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆరే.. : మంత్రి హరీశ్‌రావు

Advertisement
 
Advertisement
 
Advertisement