
వేదికపై నుంచి అభివాదం చేస్తున్న ఖర్గే, పక్కన మాణిక్‌రావు ఠాక్రే
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అప్పుడు మెదక్ నుంచి పోటీ చేసిన ఇందిరాగాంధీ ఈ ప్రాంతాభివృద్ధి కోసం బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించిందని, ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ వాటిని విక్రయిస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సంగారెడ్డిలో ఉన్న గంజి మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా కేవలం రెండు, మూడు వేలను భర్తీ చేసి మోదీ సర్కారు ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. నిరుద్యోగులు, రైతుల పక్షాన పోరాడుతున్న కాంగ్రెస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి తీసుకురావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలన్నీ అమలవుతున్నాయని పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి పార్టీ అభ్యర్థి జగ్గారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారన్నారు.
బైక్ ర్యాలీ..
హెలిక్యాప్టర్‌లో సంగారెడ్డికి చేరుకున్న ఖర్గేను కాంగ్రెస్ శ్రేణులు బైక్ ర్యాలీ ద్వారా స్వాగతం పలికారు. స్థానిక తారా డిగ్రీ కాలేజీ నుంచి గంజిమైదానం వరకు ఈ బైక్ ర్యాలీ కొనసాగింది. అనంతరం జరిగిన సభలో బీఆర్‌ఎస్‌కు చెందిన కొండాపూర్ ఎంపీపీ మనోజ్‌రెడ్డి పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో పార్టీ జాతీయ నాయకులు మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, వి.హన్మంతరావు, శ్రీధర్‌బాబు, జిల్లా నాయకులు, అనంతకృష్ణ, చెర్యాల ఆంజనేయులు, కూన సంతోష్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: నోటా (నన్ ఆఫ్ ది అబో) గురించి మీకు తెలుసా..!?