సేద తీరేదెలా?

పచ్చదనం లేక వెలవెలబోతున్న హౌసింగ్‌ బోర్డు కాలనీ పార్క్‌  - Sakshi

జహీరాబాద్‌ వాసులకు కరువైన ఆహ్లాదం

ప్రధాన పార్కుల్లో కానరాని పచ్చదనం

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ పట్టణ ప్రజలకు ఆహ్లాదం కరువైంది. పార్క్‌ల నిర్వహణను పట్టించుకోకపోవడంతో పచ్చదనం కానరావడం లేదు. పట్టణంలోని హౌసింగ్‌ బోర్డులోని ప్రధాన పార్క్‌తో పాటు పట్టణంలోని పలు పార్కుల గురించి పట్టించుకొనే వారు కరువయ్యారు. ఒకప్పడు పచ్చదనంతో కళకళలాడిన పార్కులు నేడు వెలవెలబోతున్నాయి. ఆహ్లాదం పంచే నందనవనాలు పిల్లలు ఆడుకొనేందుకు ఆట స్థలాలుగా మారాయి. ఎక్కడా పచ్చని చెట్లు కనిపించడం లేదు. ఏపుగా పెరిగిన చెట్లు మోడుబారిపోతున్నాయి. పార్కుల్లో చేపడుతున్న నిర్మాణ పనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.

● జిల్లాలోనే జహీరాబాద్‌ పెద్ద మున్సిపాలిగా ఉంది. లక్షకు పైగా జనాభా ఉన్న ఈ పట్టణంలో హౌసింగ్‌బోర్డు కాలనీ, ఎన్‌జీవోస్‌ కాలనీలో పార్కులు ఉన్నాయి. హౌసింగ్‌ బోర్డు కాలనీలోని విశాలమైన స్థలంలో కొన్నేళ్ల క్రితం పార్క్‌ నిర్మించారు. చూట్టూ ప్రహరీ నిర్మించి మధ్యలో వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేసి చెట్లను పెంచారు. మధ్యలో పచ్చిగడ్డి పరిచి క్రమం తప్పకుండా నీళ్లు పెట్టడంతో అప్పట్లో పార్క్‌ ఆహ్లాదాన్ని పంచింది.

● పట్టణంలోని పార్కులను పట్టించుకొనే నాథులే కరువయ్యారు. పార్క్‌లో బోర్‌ ఫెయిల్‌ కావడంతో నీళ్లు లేక మొక్కలు, చెట్లు ఎండుతున్నాయి. పచ్చదనం లేక పార్కుకు ప్రజలు రావడం మానేయడంతో పిల్లలు ఆటలాడుకుంటున్నారు. హౌసింగ్‌బోర్డు పార్కులో చేపడుతున్న వాచ్‌మెన్‌ రూం నిర్మాణం పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వేల రుపాయల నిధులు మంజూరవుతున్న దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

దెబ్బతిన్న ఆట వస్తువులు

● పట్టణంలోని ఎన్‌జీఓస్‌ కాలనీ పార్క్‌ను రెండు మూడు సంవత్సరాల క్రితం అభివృద్ధి చేశారు. కానీ పర్యవేక్షణ లేకపోవడంతో పిల్లలు ఆడుకొనే ఆట వస్తువులు, పరికరాలు దెబ్బతిన్నాయి. నాసిరకం సామగ్రితో దెబ్బతిన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.

● జహీరాబాద్‌ పట్టణంలోని చెన్నరెడ్డినగర్‌, వసంత్‌విహార్‌ తదితర కాలనీల్లో పార్క్‌కోసం కేటాయించిన స్థలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. చాలా వరకు పార్కు స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. పార్కుల స్థలాల్లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకొవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా మున్సిపల్‌ అధికారులు స్పందించి హౌసింగ్‌ బోర్డు, ఎన్‌జీఓస్‌, ఆదర్శనగర్‌ కాలనీల పార్కులను అభివృద్ధి చేయాలని, కబ్జాకు గురవుతున్న పార్కు స్థలాలను పరిరక్షించాలని కోరుతున్నారు.

పట్టించుకోవడం లేదు

పార్కు స్థలాలు కబ్జాకు గురవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. వసంత్‌విహార్‌ కాలనీలోని పార్కు స్థలాన్ని ఓ పాఠశాల యాజమాన్యం కబ్జా చేసి క్రీడా మైదనంగా వాడుకుంటుంది. మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విలువైన స్థలాలను కబ్జా నుంచి రక్షించాలి.

– సురేశ్‌, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు

చర్యలు తీసుకుంటాం

పట్టణంలోని పార్కుల అభివృద్ధికి చర్య లు తీసుకుంటాం. ఇటీవలే మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాను. పూర్తి విషయాలు ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. పట్టణంలోని పార్క్‌లను సందర్శించి అసరం మే రకు అభివృద్ధి పనులు చేపడతాం. పార్క్‌ స్థలా లు కబ్జా కాకుండా చర్యలు తీసుకుంటాం.

– మల్లారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌

Read latest Sangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top