గంగులతో పోటీకి బండి సై అంటారా? ఈటల గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తే మరి హుజురాబాద్‌లో ఎవరు?

Karimnagar District Overall Political Scenario Next Assembly Elections Telangana - Sakshi

రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచే జిల్లా కేంద్రం కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీగా వెలుగుతోంది. కేసీఆర్‌, బండి సంజయ్‌ సహా ఎందరో ఉద్ధండులను ఈ జిల్లా గెలిపించింది. ప్రస్తుతం జిల్లాలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి. జిల్లా నుంచి వలస వెళ్ళే నాయకులెవరు? రాబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది?

ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండే నియోజక వర్గం కరీంనగర్. తెలంగాణలో తొలి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుతో కొత్త అందాలను సంతరించుకుంది ఈ ప్రాంతం. ఇక్కడి నుంచి గత మూడు సార్లుగా గంగుల కమలాకర్ వరుసగా అసెంబ్లీకి ఎన్నికవుతున్నారు. గత ఎన్నికల్లో గంగుల కమలాకర్‌ మీద అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీజేపీ నేత బండి సంజయ్ ఇక్కడి నుంచే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 

గంగుల వర్సెస్‌ బండి?
కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచే మరోసారి బరిలో నిలవాలని గంగుల కోరుకుంటున్నారు. బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీలో ఉంటారా? లేదా అనేది క్లారిటీ లేదు. బండి హైదారాబాద్ సిటీలో ఏదైనా స్థానం నుంచి లేదంటే హుస్నాబాద్, వేములవాడలో ఒకచోటు నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసిన చల్మేడ లక్ష్మి నరసింహారావు టీఆర్ఎస్ లో చేరారు. గతంలో పోటీ చేసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మళ్లీ పోటీ చేస్తారా అనేది చూడాలి. మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మనవడు రోహిత్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని సరైన టైమ్‌లో తెర మీదకి వస్తారనే చర్చ జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ వేరే నియోజకవర్గానికి వెళ్తే అంత స్థాయిలో గంగుల కమలాకర్ ను ఢీకొట్టే నాయకుడు బీజేపీలో ఎవరూ లేరనే చెప్పాలి. 

నియోజకవర్గ అభివృద్ధికి గంగుల తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. మూడు సంవత్సరాలుగా మంత్రి హోదాలో నిధులు బాగానే రప్పిస్తున్నారు. జరుగుతున్న, చేసిన పనులే తనను గెలిపిస్తాయని చెబుతున్నారాయన. అయితే కార్పొరేషన్‌లో కొందరు కార్పొరేటర్ల తీరు మంత్రికి మైనస్‌ అయ్యే ప్రమాదం కూడా ఉందంటున్నారు.
(చదవండి: తగ్గేదేలే.. బీజేపీ నేతలపై కవిత పరువు నష్టం దావా!)

దూసుకెళ్తున్న ఎమ్మెల్యే రవిశంకర్‌
ఎస్సీ నియోజకవర్గం చొప్పదండిలో టిఆర్ఎస్ పటిష్టస్థితిలో ఉంది. ఎమ్మెల్యే రవిశంకర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పించడంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ లు ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉండటం అదనపు బలం. సీఎం కేసీఆర్ అత్తగారి ఊరు, ఎంపీ సంతోష్ గ్రామం కూడా ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. 

నియోజక వర్గంలోని పలు మండలాల్లో కాంగ్రెస్‌ కొంత బలంగా ఉన్నా.. నాయకుల మధ్య సమన్వయ లోపం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశం. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ కారు దిగి మళ్ళీ కమళం గూటికి చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్‌కి ఈ నియోజక వర్గంలో భారీగా ఓట్లు పడ్డాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి రిపీట్ అయితే.. బీజేపీకి ప్లస్‌ కావచ్చు. కాంగ్రెస్ కూడా పుంజుకుంటున్నందున ముక్కోణపు పోటీ తప్పేలా లేదు.

మాన కొండూరులో మూడు ముక్కలాట!
మాన కొండూరు నియోజక వర్గ అధికార పార్టీలో మూడు ముక్కలాట నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సుడిగాలి పర్యటనలు చేస్తుండగా.. మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, మరో సీనియర్ నేత ఓరుగంటి ఆనంద్ లు కూడా అదే స్థాయిలో పర్యటిస్తుండటం గులాబీ పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. 

కాంగ్రెస్‌ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఆరేపల్లి మోహన్‌ టికెట్ రాకుంటే మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. పార్టీలో పెద్దల ఆశిస్సులున్నాయంటూ ఓరుగంటి ఆనంద్‌ చెప్పుకుంటున్నారు. ఆయన ఫుడ్‌ కార్పొరేషన్‌ మెంబర్‌ పోస్టు రెన్యువల్‌తో సరిపెట్టుకుంటారో లేక.. ఎమ్మెల్యే సీటు కోసం పట్టుపడతారో చూడాలి. టికెట్ రాకపోతే  ఓరుగంటి బీజేపీ వైపు వెళ్తారని కూడా ప్రచారం జరుగుతోంది. 

కాంగ్రెస్ నుంచి చాలా యాక్టీవ్ గా ఉన్న కవ్వంపల్లికి డాక్టర్‌గా మంచి పేరుంది. రెగ్యులర్ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తూ కాంగ్రెస్ కు ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకును స్థిరపడేలా చేశారు.. అదే అంశం తనకు కలిసొస్తుందన్న ధీమాలో ఉన్నారాయన. ఆరేపల్లి మోహన్ టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తే కవ్వంపల్లి భవితవ్యం ఏంటనేది కూడా ఆసక్తికరంగా మారింది. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన గడ్డం నాగరాజు ఈ సారి కూడా తనకు టికెట్ వస్తుందని ఆశతో ఉన్నారు.
(చదవండి: అమిత్‌ షా చెప్పులు మోసిన బండి సంజయ్‌.. గుజరాతీ గులామ్‌ అంటూ కేటీఆర్‌ ఫైర్‌)

హుజురాబాద్‌ నుంచి ఈటల పోటీ చేయరా?
హుజూరాబాద్ నియోజకవర్గం రాజకీయాలకు అసలు సిసలైన అడ్డాగా మారుతోంది. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచీ గులాబీ పార్టీని ఆదరించిన సెగ్మెంట్‌ గత ఏడాది జరిగిన ఉప ఎన్నికలో కమలం పార్టీలో కలిసిపోయింది. గత ఏడాది ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరడంతో ఇక్కడి రాజకీయం ఆసక్తికరంగా మారింది. 

ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్‌ ఇక్కడి నుంచే దళితబంధు పథకాన్ని ప్రకటించారు. మొత్తం 18 వేల కుటుంబాలకు పది లక్షల చొప్పున అందించారు. అయినప్పటికీ చావో రేవో అంటూ బీజేపీ తరపున బరిలో దిగిన ఈటల విజయం సాధించారు. కాంగ్రెస్‌ దారుణంగా మూడు వేల ఓట్లు మాత్రమే పొందగలిగింది. తొలిసారి హుజురాబాద్‌ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరింది. 
 
2021 ఉప ఎన్నిక హుజూరాబాద్ రాజకీయాలు స్వరూపాన్ని మార్చేసింది. కొంత కాలం నుంచి ఈటల రాజేందర్.. తాను సీఎం కేసీఆర్ పై గజ్వేల్‌లో పోటీ చేస్తానంటున్నారు. మీరు రెడీనా అంటూ కేసీఆర్‌కు సవాల్ విసరడం కొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేపిందనే చెప్పాలి. టీఆర్‌ఎస్ లో చేరి ఎమ్మెల్సీ అయిన పాడి కౌశిక్ రెడ్డి ఈటలపై విరుచుకు పడుతున్నారు. ఈటల నియోజకవర్గం మారితే ఇక్కడి నుంచి బీజేపీ తరపున ఎవరు పోటీచేస్తారనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే ఈటల సతీమణి జమున పోటీ చేస్తారనే ప్రచారం ఇప్పటికే  నియోజకవర్గంలో ఊపందుకుంది. 
(చదవండి: బీజేపీ ప్రచారం కోసమే ఎన్టీఆర్‌ను అమిత్‌ షా కలిశారు: కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు)

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top