2022 కంటే ముందే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం! | Did You Know Russia Begun War on Ukraine Airspace Years Before 2022 | Sakshi
Sakshi News home page

2022 కంటే ముందే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం!

Mar 2 2022 4:29 PM | Updated on Mar 4 2022 12:04 PM

Did You Know Russia Begun War on Ukraine Airspace Years Before 2022 - Sakshi

ప్రతి సంక్షోభ సమయంలోనూ ఆకాశ మార్గాలను మూసివేయాల్సిన అనివార్యత ఉక్రెయిన్‌కు ఏర్పడింది. ఎందుకంటే..?

రష్యా యుద్ధం ప్రకటించగానే ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసివేసింది. అయితే, ఉక్రెయిన్ గగనతలంపై 2022 కంటే ముందే రష్యా యుద్ధాన్ని ప్రారంభించిందన్న సంగతి మీకు తెలుసా?

యుద్ధ భయంతో ఉక్రెయిన్‌ గగనతలాన్ని మూసివేయడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే పౌర విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అమెరికా, నాటో దళాలకు చెందిన కొన్ని మానవరహిత గూఢచారి విమానాలు మాత్రమే ఉక్రెయిన్ గగనతలంపై ఇపుడు కనబడుతున్నాయి. అయితే గగనతలం మూసివేయడం ఉక్రెయిన్‌కు కొత్త కాదు. ఇది 2014కి ముందు ప్రారంభమైంది. ఆ ఏడాది తర్వాత ప్రతి సంక్షోభ సమయంలోనూ ఆకాశ మార్గాలను మూసివేయాల్సిన అనివార్యత ఉక్రెయిన్‌కు ఏర్పడింది. ఎందుకంటే..?

298 మంది అమాయకులు బలి
ఆ రోజు 2014 జూలై 17. ఆమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్‌కు బయలుదేరిన మలేసియా ఎయిర్‌లైన్స్‌ విమానం ఎంహెచ్‌17 తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా సరిహద్దుకు సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలింది. 283 మంది ప్రయాణికులు, 15 మంది విమాన సిబ్బంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ముందు అందరూ ప్రమాదంగానే భావించారు. తర్వాతే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భూతలం నుంచి క్షిపణి ప్రయోగించి విమానాన్ని కూల్చివేసినట్టు వెల్లడికావడంతో యావత్‌ ప్రపంచం దిగ్భ్రమకు గురైంది. 

అసలేం జరిగింది?
దక్షిణ ద్వీపకల్పం.. అప్పటి సార్వభౌమ ఉక్రెయిన్‌లో భాగమైన క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద, తమకు అనుకూల తిరుగుబాటు గ్రూపులకు రష్యా మద్దతునిచ్చింది. ఈ సంక్షోభ సమయంలోనే మలేసియా విమానం కూల్చివేత ఘటన జరిగింది. ఈ విమానానికి ఉక్రెయిన్‌లో ఎటువంటి స్టాప్‌లు లేవు. ఉక్రెయిన్- రష్యా సరిహద్దు మీదుగా తూర్పు ఉక్రెయిన్‌లోని కల్లోలిత ప్రాంతాలపై 33,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని క్షిపణితో నేలకూల్చారు. విమానం మూడు ముక్కలై తూర్పు ఉక్రెయిన్‌లోని వివిధ ప్రదేశాలలో నేలపై కూలిపోయింది. మొత్తం 298 మంది ప్రయాణికులు, సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల గ్రూపులు విమానాన్ని కూల్చివేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే, ఈ దారుణ ఘటనలో తమ ప్రమేయం ఉందన్న ఆరోపణలను రష్యా నేటికీ ఒప్పుకోకపోవడం గమనార్హం. నలుగురు వ్యక్తులు, ముగ్గురు రష్యా మాజీ ఏజెంట్లు, విమానాన్ని కూల్చివేసినట్లు అభియోగాలు మోపి దర్యాప్తు సంస్థలు చేతులు దులుపుకున్నాయి.

తప్పిన పెను ముప్పు
2014లో జరిగిన ఘటనకు ముందు మరికొన్ని ఉక్రెయిన్ సైనిక విమానాలు కూడా కూల్చివేయబడ్డాయి. అయితే సేఫ్ ఫ్లయింగ్ జోన్‌లో ఎగురుతున్న పౌర విమానంపై దాడి యావత్‌ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసింది. మలేసియా విమానం కూల్చివేసిన రోజు.. పలు పౌర విమానాలు అదే మార్గంలో ప్రయాణించాయి. ఎయిర్ ఇండియా విమానం ఒకటి అదే జోన్ గుండా ప్రయాణించాల్సి ఉంది. అదృష్టవశాత్తు మిగతా విమానాలు సురక్షితంగా బయటపడ్డాయి. (క్లిక్‌: భారత్‌ అభ్యర్థనకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన రష్యా..)

ఉక్రెయిన్‌కు రష్యా దెబ్బ
మలేసియా విమానం కూల్చివేత తర్వాత ఉక్రెయిన్‌ గగనతలం గుండా ప్రయాణించే విమానాల సంఖ్య తగ్గిపోయింది. ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్‌ గగనతలంపై నుంచి విమాన రాకపోకలు చాలా వరకు తగ్గాయి. ఉక్రెయిన్‌ గగనతలం సురక్షితం కాదన్న ప్రచారంతో మిగతా ప్రపంచం నుంచి ఉక్రెయిన్‌ను రష్యా దూరం చేయగలిగింది. మరోవైపు ఆర్థికంగానూ శత్రుదేశాన్ని దెబ్బకొట్టింది. తాజాగా రష్యా దురాక్రమణకు దిగడంతో.. గతానుభవాల దృష్ట్యా ఉక్రెయిన్‌ ముందుగా గగనతలాన్ని మూసివేసింది. దీంతో ఫిబ్రవరి 24న భారత పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు న్యూఢిల్లీ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఉక్రెయిన్ సరిహద్దులను చేరుకోవడానికి ముందే వెనుదిరిగింది. ఉక్రెయిన్ గగనతలం మీదుగా ప్రయాణించాల్సిన ఇజ్రాయెల్ విమానం కూడా యూ-టర్న్‌ తీసుకోక తప్పలేదు. (క్లిక్‌: ఉక్రెయిన్‌ సంక్షోభం: చిన్నమ్మ ఈ పరిస్థితుల్లో ఉండి ఉంటేనా..)

- సాక్షి, వెబ్‌ స్పెషల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement