అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ వికారాబాద్‌కు ఆరు కిలోమీటర్ల దూరం నుంచి ట్రిపుల్ ఆర్ దక్షిణ రింగ్ రోడ్డుపై తొలగిన సందిగ్ధత పాత డీపీఆర్ ప్రకారం పడమరరంగారెడ్డికే పరిమితం గత అలైన్‌మెంట్‌కుస్వల్ప మార్పులతో ప్రతిపాదనలు
వికారాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్) అలైన్‌మెంట్ జిల్లా మీదుగా వెళ్లడం ఖరారైంది. గతంలో అలైన్‌మెంట్ ప్రక్రియను హెచ్‌ఎండీఏ ప్రతిపాదించడం.. అభ్యంతరాల గడువు ముగిసిన నేపథ్యంలో రీజినల్ దక్షిణ భాగంలో భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణ అధికారిగా వికారాబాద్ ఆర్‌డీఓను అడ్మినిస్ట్రేటర్‌గా నియమిస్తూ తాజాగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 23 గ్రామాల మీదుగా రీజినల్ రింగ్ రోడ్డు వెళ్లనుంది. ఇందుకోసం 1,016 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. రోడ్డు ఎక్కడి నుంచి వెళ్తుందనే విషయంలో గ్రామాలు, సర్వే నంబర్లతో సహా స్పష్టతనిచ్చారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. గత అలైన్‌మెంట్ ప్రకారం పడమర ప్రాంతంలో రీజినల్ రోడ్డు హైదరాబాద్‌కు 40 నుంచి 45 కిలోమీటర్ల దూరం నుంచి రంగారెడ్డి జిల్లాకే పరిమితం చేస్తూ మొదటి డీపీఆర్ తయారు చేశారు. మిగతా భాగాల్లో హైదరాబాద్‌కు 60 నుంచి 80 కిలోమీటర్ల దూరం నుంచి నిర్మించేలా రూపొందించారు. దీంతో జిల్లా మీదుగా రీజనల్ రోడ్డు వెళ్తుందా? లేదా? అనే విషయంపై జిల్లా ప్రజల్లో చర్చ జరుగుతూ వచ్చింది. ఇదే సమయంలో తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాలతో పోలిస్తే మన జిల్లా సరిహద్దు కలిగి ఉన్న పడమర ప్రాంతంలో రీజినల్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌కు తక్కువ దూరం నుంచి నిర్మిస్తున్నారని జిల్లా నేతలు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. దీంతో పశ్చిమ ప్రాంతాన ఉన్న మనకు అన్యాయం జరుగుతుందని నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా ప్రతిపాదించిన దాని ప్రకారం వికారాబాద్ జిల్లాకు చేరువగా ఆరు కిలోమీటర్ల దూరం నుంచి ట్రిపుల్ ఆర్ వెళ్లనుంది.
తాజా నోటిఫికేషన్ ప్రకారం..
గత డీపీఆర్‌లో పొందుపర్చిన అలైన్‌మెంటులో పడమర ప్రాంతంలో మన జిల్లా సరిహద్దు ప్రాంతమైన రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆలూరు – కౌకుంట్ల గ్రామాల మధ్యలోంచి తంగేడుపల్లి మీదుగా వెళ్లేలా ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనల్లో మన జిల్లాలోని పూడూరు, నవాబుపేట మండలాలకు చెందిన ఒకటి రెండు గ్రామాల పరిధిలోంచి ట్రిపుల్ ఆర్ వెళ్లేలా డిజైన్ చేశారు. తాజా ఉత్తర్వుల్లో జిల్లా పరిధిలోని నాలుగు మండలాలను కలుపుతూ రోడ్డు వెళ్తుంది. పూడూరు, నవాబుపేట మండలాల పరిధిలోని పదిహేనుకు పైగా గ్రామాలు రీజినల్ రింగ్‌రోడ్డు పరిధిలోకి వస్తుండగా వికారాబాద్, మోమిన్‌పేట మండలాల పరిధిలోని ఐదు గ్రామా ల చొప్పున కలుపుతూ వెళ్లేలా ఉత్తర్వులు జారీ చేశారు. పూడూరు మండలం గొంగుపల్లి, గట్‌పల్లి, కెరవెళ్లి, మంచన్‌పల్లి, మన్నెగూడ, పెద్ద ఉమ్మెంతాల్, పూడూరు, రాకంచర్ల, సిరిగాయపల్లి, తుర్కెన్కెపల్లి, ఎన్కెపల్లి మీదుగా వెళ్లనుంది. నవాబుపేట మండలం చించల్‌పేట్, చిట్టిగిద్ద, దాతాపూర్, వట్టిమీనపల్లి, నవాబుపేట, యావాపూర్, వికారాబాద్ మండలం పీరంపల్లి, పులుసుమామిడి, బురాన్‌పూర్, పాతూర్, మోమిన్‌పేట మండలం దేవరంపల్లి, టేకులపల్లి గ్రామాల మీదుగా వెళ్లనుంది.
భూ సేకరణ దిశగా ఏర్పాట్లు
ఇవీ లాభాలు..
రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మించిన చుట్టుపక్కల ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ప్రధానంగా హైదరాబాద్‌కు కనెక్టివిటీ పెరుగుతుంది. స్థానికంగా ఉపాధి, ఉత్పాదకత పెరుగుతుంది. రోడ్డుకు ఇరు వైపులా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. భూముల ధరలు పెరుగుతాయి. మోమిన్‌పేట్, నవాబుపేట, శంకర్‌పల్లి, వికారాబాద్, పరిగి తదితర పట్టణాల మీదుగా వెళ్లే దారులు ఫోర్ లేదా సిక్స్ లైన్లుగా మారి నగరానికి కనెక్టివిటి పెరుగుతుంది. కనెక్టివిటీ పెరగడంతో పశ్చిమాన ఉన్న మన జిల్లా నుంచి కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు నగరానికి తరలించి రైతులు లాభాలు పొందేందుకు దోహదపడుతుంది.


