కొడంగల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మందుల కొరత
ప్రైవేటులో కొనుగోలు చేస్తున్న రోగులు
నామమాత్రపు సరఫరాతో అవస్థలు
పట్టించుకోని ఉన్నతాధికారులు
తాండూరు: పట్టణంలో కొడంగల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని మందుల కొరత వెంటాడుతోంది. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆస్పత్రికి నిత్యం వందలాది మంది వైద్యం కోసం వస్తుంటారు.మందులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు నుంచి తెచ్చుకొంటున్నారు. ఆరు నెలల క్రితం తాండూరులోని ప్రభుత్వజిల్లా ఆస్పత్రిని కొడంగల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిగా మార్చారు. దీంతో జిల్లా వైద్య విధాన పరిషత్ ఆధీనంలో ఉన్న హాస్పిటల్ కొడంగల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిగా మారింది. నాటి నుంచి డీఎంఈ ద్వారానే సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం టీకాలు, సిరంజీలు, మందుల లేక రోగులు అవస్థలు పడుతున్నారు.
నిత్యం 1,800 సిరంజిల వినియోగం
ఆస్పత్రికి రోజూ 550 నుంచి 600 మంది ఔట్ పేషంట్లు వస్తుంటారు. మరో వంద మందికి పై గా ఇన్‌పేషంట్లు ఉంటారు. నెల రోజులుగా మందుల సరఫరా సక్రమంగా లేనట్లు తెలిసింది. వైద్యులు సూచించిన మందులను రోగులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. రోజూ 1,800 వరకు సిరంజీలను వినియోగిస్తుంటారు. ఆస్ప త్రిలోని పది విభాగాలకు వంద చొప్పున సిరంజీలు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఔట్ పేషంట్ల కోసం మరో 500, రక్త నమూనాల సేకరణకు మరో 300 సిరంజీలు అవసరం అవుతాయి. కానీ ఆ మేరకు సరఫరా కావడం లేదు. అంతేకాకుండా సామగ్రి కొరత కూడా ఉన్నట్లు తెలిసింది.
కొరవడిన పర్యవేక్షణ
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలో కొనసాగుతున్న ఈ ఆస్పత్రిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. మందులు, వైద్య సామగ్రి సరఫరా సక్రమంగా లేకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. రోగులపై ఆర్థిక భారం పడుతున్నా సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
రోగులు ప్రైవేటు బాట
కొడంగల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. సర్కారు ఆస్పత్రులకు పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా వస్తుంటారు. మందుల కొరత, సౌకర్యాల లేమీతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో వైద్య సేవలు సక్రమంగా లేకపోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.
కొరత లేకుండా చూస్తాం
ఆస్పత్రిలో మందుల కొరత తలెత్తకుండా చూస్తాం. రెండు రోజుల క్రితం హైదరాబాద్, వికారాబాద్ ప్రాంతాల నుంచి కొంత మేర మందులు తెచ్చాం. ఇంకొన్ని కావ్సాల్సి ఉంది. స్టాక్ పాయింట్‌కు రాగానే తెస్తాం. అప్పటి వరకు వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చూస్తాం. అవసరానికి మించి సిరంజీలు వాడుతున్నారనే దానిపై విచారణ చేస్తున్నాం.
– రజా మాలిక్, సూపరింటెండెంట్, కొడంగల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి


