● డ్రగ్స్ అక్రమ రవాణా
● ఇద్దరి అరెస్టు, పరారీలో మరొకరు
ఇబ్రహీంపట్నం: డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలు చేస్తున్న ముఠాను షాద్నగర్ ఎస్ఓటీ, ఇబ్రహీంపట్నం పోలీస్ల జాయింట్ ఆపరేషన్లో పట్టుకున్నారు. 49 గ్రాముల ఎండీఎంఏ (డగ్స్)ను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేయగా మరో నిందితుడు చిక్కలేదు. సీఐ మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాకు చెందిన అబ్దుల్ మిసాల్ ఏవీ (33), తారిఖ్ టీవీ(25) డ్రగ్స్ విక్రయించడంతోపాటు వినియోగిస్తున్నారు. బెంగళూర్లో నివసించే పీటర్ అలియాస్ పప్పితో ఉన్న సంబంధాలతో మాదకద్రవ్యాల కొనుగోలు, సరఫరా వ్యవహారాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అబ్దుల్ మిసాల్ బెంగళూరుకు తారిఖ్ టీవీని పంపించి పప్పి నుంచి 50 గ్రాముల ఎండీపీఏ సేకరించాడు. డ్రగ్స్ కొనుగోలు సంబంధించి వీరి మధ్య రూ.66 వేల ఆర్థిక లావాదేవీలు నడిచాయి. వీటిని హైదరాబాద్కు తీసుకొచ్చి గురువారం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఉప్పరిగూడ వద్ద నిఘా పెట్టి పోలీసులు పట్టుకున్నారు. అబ్దుల్ మిసాల్ వద్ద 30 గ్రాములు, తారిఖ్ నుంచి 19 గ్రాముల ఎండీఎం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. ప్రధాన నిందుతుడైన పీటర్ పోలీసులకు చిక్కలేదు. మాదకద్రవ్యాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో డ్రగ్స్ సరాఫరాలో మోస్ట్ వాంటెడ్ జాబితాలో అబ్దుల్ మిసాల్ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


