ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఫిర్యాదుదారుల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తుపై సంబంధిత శాఖల అధికారులు తక్షణం స్పందించాలని సూచించారు. నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 19, ఇతర శాఖలకు సంబంధించి 7 మొత్తం 26 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ కిరణ్మయి, చంద్రారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆమనగల్లు: సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆయనను కొడంగల్‌లో కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, ఆమనగల్లు సింగిల్‌విండో చైర్మన్ గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ తలకొండపల్లి మండల మాజీ అధ్యక్షుడు గుజ్జుల మహేశ్ తదితరులు ఉన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో తాత్కాలిక ప్రాతిపదికన ఐదు ఆప్తాల్మి క్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాలల్లో చదివే విద్యార్థుల కంటి పరీక్షల నిమిత్తం తాత్కాలిక ప్రాతిపదికన 50 రోజుల కార్యక్రమానికి సంబంధించి రోజుకు రూ.1000 చొప్పున పారితోషకం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సు విద్యార్హత పత్రాలతో జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఈనెల 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా నియామకం
చేవెళ్ల: మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా పామెన జ్యోతిబీంభరత్ రెండోసారి నియమితులయ్యారు. మహిళా విభా గం రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సోమవారం రాష్ట్ర కమిటీతోపాటు జిల్లా అధ్యక్షుల ఎన్నికను ప్రకటించారు. ఈ సందర్భంగా పామెన జ్యోతిభీంభరత్‌ను రెండోసారి నియమించారు. ఆమెకు జిల్లాలోని పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
షాద్‌నగర్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పట్టణ సమీపంలోని దూసకల్ బైపాస్ రోడ్డులో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ప్రణయ్ కథనం ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని సోలీపూర్‌కు చెందిన హరీష్, కడియాకుంట తండా పంచాయతీ పరిధిలోని తిమ్మాజిపల్లితండాకు చెందిన ముడావత్ కిషన్ (66)ను తీసుకొని బైక్‌పై ఆదివారం రాత్రి షాద్‌నగర్‌కు వచ్చారు. అర్థరాత్రి ఇంటికి తిరిగి వెళ్తుండగా పట్టణ సమీపంలోని దూసకల్ బైపాస్‌వద్ద రోడ్డును దాటుతున్న క్రమంలో కర్నూల్ నుంచి హైదరాబాద్‌వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న హరీష్‌కు స్వల్ప గాయాలు కాగా వెనుక కూర్చున్న ముడావత్ కిషన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వెంటనే అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు కిషన్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుడు ముడావత్ రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


