గచ్చిబౌలి: హోటల్లో బస చేసిన ఓ అమెరికా వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు.. కాలిఫోర్నియాకు చెందిన మిచెల్ బ్రియాన్ లి(41) వ్యాపార పనుల నిమిత్తం తన వ్యాపార భాగస్వామి డేవిడ్ వుతో కలిసి ఈ నెల 2న హైదరాబాద్‌కు వచ్చారు. గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టెర్మినస్‌లోని మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్‌లో పక్కపక్కనే ఉన్న గదుల్లో బస చేశారు. 4వ తేదీ సాయంత్రం నుంచి ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు. 5న బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌కు రాకపోయేసరికి డేవిడ్ నిర్వాహకులను వాకబు చేశారు. పోలీసులకు సమాచారం అందించగా వచ్చి పరిశీలించారు. బెడ్‌పై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. 108 సిబ్బంది వచ్చి మిచెల్ మృతి చెందినట్లు తెలిపారు. మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక వస్తేనే తెలుస్తుందని, శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు.


