శంషాబాద్: సంచలనం రేపిన మీర్‌పేట జంట హత్యల కేసులో నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కుటుంబ కలహాలతో పాటు అత్తగారి కుటుంబంపై కక్ష పెంచుకోవడంతో పాటు తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన షేక్ మహ్మద్ సిద్దిఖీ జంట హత్యలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. శంషాబాద్ డీసీపీ రాజేష్ శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లాకు చెందిన షేక్ మహ్మద్ సిద్ధిఖి తన భార్య నూర్‌బేగంతో కలిసి జల్‌పల్లి షరీఫ్‌నగరంలో నివాసముంటున్నాడు. భార్య నూర్‌బేగం తల్లి నిరంజన్‌బీ, ఆమె పెద్దకుమార్తె కుటుంబం, కుమారుడు యూసుఫ్ కుటుంబం బడంగ్‌పేట్ సాయివిహార్‌నగర్‌లో నివాసముంటున్నారు. కొంతకాలంగా సిద్దిఖి తన భార్య సోదరుడి భార్యను లైంగిక వేధింపులకు గురిచేయడంతో పాటు అత్త కుటుంబంతో తరచూ గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో వారు ఇతనిని దూరం పెడుతూ వస్తున్నారు. ఇంటికి కూడా రావొద్దని పలుమార్లు హెచ్చరించారు. దీంతో సిద్దిఖి కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 4న సోదరుడి ఇంటికి వెళ్లిన సిద్దిఖి భార్య నూర్‌బేగం, తన సోదరుడి భార్య రెష్మాబేగంలతో కలిసి మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు అందిన విషయం తెలుసుకున్న సిద్దిఖి అదే రోజు సాయంత్రం మీర్‌పేటలోని పెట్రోలు బంకులో పనిచేస్తున్న బావమరిది యూసుఫ్‌ను తన కారులో ఎక్కించుకుని వారి ఇంటికి వెళ్లాడు. ఆగ్రహంతో యూసుఫ్‌పై కత్తితో దాడిచేయగా అతడికి తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న అత్త నిరంజన్‌బీ, బావమరిది భార్య రెష్మా బేగంను కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో వారు సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఆ తరువాత కారులో పరారయ్యాడు. మీర్‌పేట్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్లు డీసీపీ తెలిపారు.
మీర్‌పేట జంట హత్యల కేసులో నిందితుడి అరెస్ట్


