ధారూరు: ధారూరు మెథడిస్ట్ క్రిస్టియన్ జాతర ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ నెల 10 నుంచి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. సువిశా ల ప్రదేశం.. కాగ్నా నది పక్కన పెద్ద ఎత్తున ఏర్పా ట్లు చేశారు. ఏటా లక్షలాది మంది భక్తులు వచ్చి ఏసుక్రీస్తు శిలువ వద్ద ప్రార్థనలు చేస్తారు. ఈ సారి కూడా లక్షల్లో యాత్రికులు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఆరు రోజుల పాటు జాతర జరగనుంది. వేడుకలకు బీదర్, గుల్బర్గ, రాయచూర్, సోలాపూర్, బెంగళూరు, బెల్గాం, గోవాతోపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తారు. వీరితో పాటు విదేశాల నుంచి ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతారు. వీఐపీల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.
జాతర చరిత్ర
1921లో గుల్బర్గ నుంచి రైలులో రెవరెన్ సీమండ్స్ అతని మిత్రుడు జేటీ సీమండ్స్ హైదరాబాద్కు బయలుదేరారు. ధారూరు స్టేషన్లో రైలు సాంకేతిక లోపంతో 3గంటల పాటు ఆగిపోయింది. రెవరెన్ సీమండ్స్, జేటి సీమండ్స్ రైలు దిగి కాగ్నా నది పక్కన ఉన్న ఇప్ప చెట్టు కింద కూర్చొని ఏసుక్రీస్తును ప్రార్థించారు. దీంతో వారి మనస్సు నిర్మలంగా మారింది. హైదరాబాద్లో తమ పని ఎలాంటి ఆటంకం లేకుండా నెరవేరితే ఈ స్థలంలో ఏటా జాతర నిర్వహిస్తామని వేడుకున్నారు. హైదరాబాద్లో అనుకున్న పని పూర్తి కావడంతో 1922లో ఇక్కడికి వచ్చి ఇప్పచెట్టు కింద ఏసుక్రీస్తు శిలువను స్థాపించి జాతరకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఏటా ఉత్సవాలు కొనసాగుతున్నాయి.
విశేషాలు
మెథడిస్ట్ జాతరలో ఏసుక్రీస్తు కీర్తనలు, భజనలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. శిలువ వద్ద ఆరు రోజులపాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. వక్తల ప్రసంగాలు, వివిధ కార్యక్రమాలు ఉంటాయి. జా తరలో ఏర్పాటు చేసే హుండీల్లో భక్తులు కానుకలు సమర్పించడం అనవాయితీగా వస్తోంది. బంగారం, వెండి, నగదు సమర్పించుకుంటారు. ఏసుక్రీస్తు పేరిట పలువురు భక్తులు గొర్రెలు, మేకలు, కోళ్లు, కోడిగుడ్లు, ఆవులను బహూకరిస్తారు.
ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు
జాతర ప్రాంగణంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు, పారిశుద్ధ్య చర్యలు, వైద్యం, నీటి వసతి కల్పిస్తారు. జాతర జరిగే ఆరు రోజుల పాటు ప్రత్యేక బందోబస్తు కొనసాగుతుంది. కాగ్నా నది వంతెనపై కాపాలా ఏర్పాటు చేస్తారు. ధారూరు, బీదర్ మధ్య ప్రత్యేక రైలు నడుస్తుంది. ఉత్సవాలు జరిగే రోజుల్లో హైదరాబాద్ – ముంబై మధ్య తిరిగే కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను ధారూరు స్టేషన్లో ఆపుతారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులను నడుపుతారు. ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది నీటి అవసరాలను కాగ్నా నది తీరుస్తోంది. పెద్ద సంఖ్యలో ఆట వస్తువుల దుకాణాలు ఏర్పాటు చేస్తారు. రంగుల రాట్నం, జెయింట్ వీల్, పిల్లలు సరదాగా తిరిగేవి అందుబాటులో ఉంచుతారు. అతిథులు, బిషప్లు, దేశ, విదేశాల నుంచి వచ్చే వారి కోసం సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన శిలువను సిద్ధం చేశారు.


