విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు | - | Sakshi
Sakshi News home page

విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

Nov 1 2026 8:13 AM | Updated on Nov 1 2026 8:13 AM

శంకర్‌పల్లి: పెండింగ్‌ కేసుల దర్యాప్తులో వేగం పెంచాలని చేవెళ్ల డీసీపీ యోగేశ్‌ గౌతమ్‌ అన్నారు. మోకిల పోలీస్‌స్టేషన్‌ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఠాణాలో సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, బాధితుల కు సత్వరమే న్యాయం జరిగేలా చొరవ తీసుకోవాలన్నారు. రికార్డులను మొయింటైన్‌ చేయాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. గ్రామాలు, విల్లాలు, అపార్ట్‌మెంట్లలో సీసీ కెమెరాలు, రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పించాని సూచించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. తనిఖీల సమయంలో మోకిల సీఐ శ్రీనివాస్‌ రెడ్డి, ఎస్‌ఐలు లక్ష్మణ్‌, సురేశ్‌, పద్మ, సిబ్బంది ఉన్నారు.

అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే చర్యలు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మించి బియ్యం విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని అదనపు కలెక్టర్‌ కె.చంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వివిధ రకాల బియ్యం విక్రయ ధరలపై కమిషనర్‌తో జిల్లా, రాష్ట్ర రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. రైస్‌ మిల్లర్లు, ట్రేడర్లు, హోల్‌సేల్‌ డిపో నిర్వాహకులు, రిటైలర్లు వినియోగదారుల నుంచి నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తం వసూలు చేయరాదని సూచించారు. ప్రజలకు న్యాయమైన ధరలకు బియ్యం అందుబాటులో ఉండేలా నిర్ణయాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

రక్తదానం ప్రాణదానంతో సమానం

కందుకూరు: రక్తదానం చేయడం ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేయడంతో సమానమని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం మహేశ్వరం మండల కేంద్రంలోని సుమంగళి కన్వెన్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని దానాల్లో రక్తదానం గొప్పదన్నారు. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం ఇచ్చిన యువకులు, కార్మికులు, ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులను అభినందించారు. రక్తదాన శిబిరంలో సుమారు 2వేల మంది పాల్గొనగా 680 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి, మహేశ్వరం, కందుకూరు సీఐలు రాఘవేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు మారయ్య, ప్రసాద్‌, ధనుంజయ్‌, ట్రాఫిక్‌ పోలీసులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రాణాలు కాపాడిన

డయల్‌ 100

ఇబ్రహీంపట్నం: చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటానని 100కు డయల్‌ చేసిన ఓ మహిళను ఇబ్రహీంపట్నం పోలీసులు కాపాడారు. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..కర్ణంగూడ వైపు నుంచి పెద్ద చెరువు వైపు వస్తూ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ మహిళ 100కు డయల్‌ చేయడంతో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరిగి ఆ నంబర్‌కు ఫోన్‌ చేస్తే ఎలాంటి స్పందన రాకపోవడంతో వెంటనే చెరువు పరిసర ప్రాంతాలను గాలించారు. చెరువు వైపు వెళ్తున్న మహిళను గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. ఆమె ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మహిళ ప్రవర్తను బట్టి మానసిక స్థితి బాగాలేదని గుర్తించి హయత్‌నగర్‌లోని అనాథాశ్రమానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement