ప్రభుత్వ ఆస్పత్రిలో మాతాశిశు మరణం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రిలో మాతాశిశు మరణం

Nov 1 2026 8:13 AM | Updated on Nov 1 2026 8:13 AM

బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన అత్తింటివారిపై మృతురాలి బంధువుల ఫిర్యాదు ఘటనపై విచారణ చేపట్టిన జిల్లా వైద్యాధికారులు

షాద్‌నగర్‌: పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లిన కుటుంబానికి అంతులేని విషాదం ఎదురైంది. ప్రసూతి కోసం వెళ్లిన గర్భిణితో పాటు కడుపు లోని శిశువు కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి షాద్‌నగర్‌ ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కొందుర్గు మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన రమేష్‌ కుమార్‌ వివాహం కొత్తూరు మండలం ఇన్ములనర్వ గ్రామానికి చెందిన రాధ (28)తో కొన్నేళ్ల క్రితం జరిగింది. రాధకు మొదటి రెండు కాన్పులో ఆడపిల్లలు జన్మించారు. మూడో కాన్పులో అబార్షన్‌ చేయించారు. నాలుగోసారి గర్భం దాల్చిన ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు సాధారణ ప్రసవం అవుతుందని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ క్రమంలో రాధకు సాయంత్రం ఒక్కసారిగా ఫిట్స్‌ వచ్చాయని అపస్మారక స్థితిలోకి వెళ్లిందని వైద్యులు తెలిపారు. వెంటనే అత్యవసర వైద్య సేవలు అందించడంలో పాటు సీపీఆర్‌ చేసినా మృతి చెందినట్లు చెప్పారు. కడుపులో ఉన్న బిడ్డనైనా కాపాడాలని అంబులెన్స్‌ మాట్లాడి హైదరాబాద్‌లోని మెటర్నిటీ ఆస్పత్రికి పంపించారు. అక్కడికి వెళ్లే సరికే మాతా శిశువులు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అర్ధరాత్రి షాద్‌నగర్‌ ఆస్పత్రికి వచ్చిన కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. తల్లీబిడ్డల ప్రాణం పోవడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. గతంలో మగబిడ్డ కోసం అత్తింటివారు తరచూ వేధించేవారని, తమ కూతురు మృతికి వారే కారణమని మృతిరాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రమేష్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

విచారణ చేపట్టిన వైద్యాధికారులు

ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై జిల్లా ఆస్పత్రుల నిర్వహణ అధికారిణి అనురాగిణి స్పందించారు. ఆస్పత్రికి వచ్చి విచారణ చేపట్టారు. ఘటనకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement