దొంగ పోలీసుకు రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

దొంగ పోలీసుకు రిమాండ్‌

Nov 1 2026 8:13 AM | Updated on Nov 1 2026 8:13 AM

విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌ నుంచి నగదు బదిలీ ఓ కానిస్టేబుల్‌ నిర్వాకం తండ్రి వైద్యానికి, కుటుంబ అవసరాలకు చేసిన అప్పుల కోసమే అంటూ విచారణలో వెల్లడి

మీర్‌పేట: వివాహిత ఆత్మహత్య కేసులో విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లు, బంగారు ఆభరణాలకు రక్షణ కల్పించాల్సిన ఓ కానిస్టేబుల్‌ దుర్వినియోగం చేసి చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ శోభన్‌ కథనం ప్రకారం.. అల్మాస్‌గూడ వినాయకహిల్స్‌లో నివసించే హేమ అదనపు కట్నం వేధింపులు తాళలేక జూలై 30న ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మృతురాలి భర్తతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. 31న వారిని కస్టడీలోకి తీసుకుని విచారణలో భాగంగా వారి నుంచి సెల్‌ఫోన్‌లు, సుమారు 12 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రవణ్‌కుమార్‌కు అప్పగించారు. కానిస్టేబుల్‌ తన తండ్రి వైద్య ఖర్చులు, ఇతర కుటుంబ అవసరాల నిమిత్తం అప్పులు చేశాడు. తండ్రి కూడా ఏడాది క్రితం చనిపోయారు. అప్పుల బాధ తీవ్రమవడంతో కేసు విచారణలో భాగంగా అప్పగించిన సెల్‌ఫోన్‌ నుంచి మొదటగా తన భార్యకు యూపీఐ ద్వారా రూ.1.37 లక్షలు, శివాజీ అనే వ్యక్తికి రూ.33 వేలను పలుమార్లు బదిలీ చేశాడు. బంగారు ఆభరణాలను ముత్తూట్‌ ఫైనాన్స్‌తో పాటు ఇతర రుణాలు ఇచ్చే సంస్థల్లో తాకట్టు పెట్టి రూ.12.37 లక్షలు తీసుకున్నాడు.

చివరికి చిక్కాడిలా...

వివాహిత ఆత్మహత్య కేసులో జైలు నుంచి విడుదలైన ఆమె భర్త రాజ్‌కుమార్‌ ఈ నెల 27న బ్యాంకు ఖాతాను తనిఖీ చేయగా పలుమార్లు నగదు బదిలీ అయినట్లు గమనించాడు. వెంటనే స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడంతో పాటు ఫోన్‌ ద్వారా కానిస్టేబుల్‌ శ్రవణ్‌కుమార్‌ నగదు బదిలీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పాటు విచారణలో స్వాధీనం చేసుకున్న మరో సెల్‌ఫోన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఓ మహిళకు ఇచ్చినట్లు సమాచారం. తండ్రి వైద్య ఖర్చులు, ఇతర అవసరాల కోసం చేసిన అప్పులు బాధలు తాళలేక విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను పలు దఫాలుగా తాకట్టు పెట్టి నగదును తీసుకున్నట్లు కానిస్టేబుల్‌ విచారణలో వెల్లడించాడు. ఈ మేరకు కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి ఈ నెల 27న రిమాండ్‌కు తరలించి, తాకట్టు పెట్టిన సొత్తును రికవరీ చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ శోభన్‌ తెలిపారు. కాగా, లాక్‌ చేసి ఉన్న సెల్‌ఫోన్‌ పాస్‌వర్డ్‌, యూపీఐ పాస్‌వర్డ్‌ తెలుసుకోవడం ఎలా సాధ్యమైందన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement