కడ్తాల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజావ్యతిరేక పాలనపై రాజీలేని పోరాటం సాగించాలని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఎస్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మన్నాలాల్ రావత్ పిలుపునిచ్చారు. మైసిగండిలోని ఎంఆర్‌జీ గార్డెన్‌లో శనివారం ఎస్టీమోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే ఆదివాసీ చెంచుల అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఆదివాసీలకు న్యాయం జరుగకపోవడం సిగ్గుచేటన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ కుటుంబ నియంతృత్వ పాలనలతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్‌ను నమ్మి అధికారంలోకి తెచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసంపై నీళ్లు చల్లిందని, ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్టీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ నేతాజీ, అదిలాబాద్ ఎంపీ నగేశ్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్‌నాయక్, నాయకులు ఆజ్మీరా బాబీ, అమర్‌సింగ్ తిలావత్, గువ్వల బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మన్నాలాల్ రావత్


