● జాతీయ హోదా కాదు.. నిధులు కావాలి
● సీఎంతో కలిసి ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధం
● కుర్చీలు ఎవరికీ శాశ్వతం కాదు
● పాలమూరు ఎంపీ డీకే అరుణ
కొడంగల్: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. శనివారం కొడంగల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ‘పాలమూరు– రంగారెడ్డి’లో పాలమూరు లేదు.. రంగారెడ్డి లేదు అని విమర్శించారు. ఈ రెండు జిల్లాల సాగునీటి కోసం ప్రతిపాదించిన పథకాన్ని గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా పక్కన పెట్టాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లవుతున్నా ఇప్పటి వరకూ దీనిపై అతీగతీ లేదన్నారు. మిగిలిన రెండేళ్లలో ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డి జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా కారు.. నిధులు కావాలని తెలిపారు. ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. పాలమూరు జిల్లాను ఆయన పట్టించుకోవడం లేదని విమర్శించారు. కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు ప్రాజెక్టుతో జిల్లాలోని కొంత ప్రాంతానికి మాత్రమే సాగునీరు అందుతుందని, మిగిలిన ప్రాంతానికి వర్షాధారమే దిక్కని ఆవేదన వ్యక్తంచేశారు. గతం మాదిరిగానే మహబూబ్‌నగర్ జిల్లాలో కరువు వచ్చిందన్నారు. గత, ప్రస్తుత పాలకులు ఈ జిల్లాలో సాగునీటి వనరులు కల్పించి ఉంటే ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. కుర్చీలు ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజలకు చేసిన మేలు శాశ్వతంగా గుర్తుంటుందని సీఎంను ఉద్దేశించి అన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఢిల్లీలో కుట్ర జరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటు చోరీ జరిగి ఉంటే తెలంగాణ, కర్నాటక, కేరళలో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. కొడంగల్, కోస్గి మున్సిపాలిటీలకు అమృత్ భారత్ పథకం కింద రూ.రూ.22 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కమ్యూనిటీ భవనాలు, సీసీ రోడ్లు, ఇతర పనులకు ఎంపీ నిధుల నుంచి రూ.1.5 కోట్లు ఇచ్చామని స్పష్టంచేశారు. పీఎమ్‌శ్రీ కింద ఆరు పాఠశాలలకు రూ.80 లక్షలు, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌళిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని వివరించారు. సమావేశంలో బీజేపీ నాయకులు రతంగ్ పాండురెడ్డి, పున్నంచంద్ లాహోటీ, బస్వరాజ్, సత్య యాదవ్, ప్రతాప్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.


