ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు | - | Sakshi
Sakshi News home page

ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు

Nov 1 2026 8:13 AM | Updated on Nov 1 2026 8:13 AM

యాచారం: రాష్ట్రంలో ఏర్పడిన కరువు కాంగ్రెస్‌ తెచ్చిందే తప్ప కాలం తెచ్చింది కాదని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని మల్కీజ్‌గూడ, గాండ్లగూడెం గ్రామాల్లో శనివారం ఆయన ఎండిపోయిన వరి పంటను పరిశీలించి, రైతుల బాధలను అడిగి తెలుసుకున్నారు. బోరుబావుల్లో కొద్దిపాటి నీళ్లున్నా విద్యుత్‌ కోతలతో చేతికొచ్చిన వరి పంట పూర్తిగా ఎండిపోతోందని రైతులు తెలియజేశారు. విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతోందో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆయన మండల కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను సందర్శించి ఏఈ సుధీర్‌తో మాట్లాడారు. నిత్యం రైతులకు సరిపడా త్రీఫేస్‌ విద్యుత్‌ సరఫరా చేయాలని సూచించారు. పాలనపై సీఎం రేవంత్‌రెడ్డికి ఏ మాత్రం అవగాహన లేదని మండిపడ్డారు. జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి, తక్షణమే ఎండిపోయిన పంటలను సర్వే చేసి, ఎకరాకు రూ.20 వేల చొప్పున రైతులకు పరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో పారిశ్రామిక పార్క్‌లు, ఫ్యూచర్‌సిటీ, ఇతర పరిశ్రమల కోసం చేపట్టే భూసేకరణతో జిల్లా ఊనికికే ప్రమాదం ఏర్పడిందన్నారు. భూసేకరణతో ఈ ప్రాంత రైతులు పూర్తిగా నిరాశ్రయులుగా మారే అవకాశం ఉందన్నారు. దేని కోసం భూసేకరణ చేస్తున్నారో ప్రజలకు తెలియజేయడం లేదన్నారు. భూసేకరణలో రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ప్రతి పట్టభద్రుడిని స్వయంగా కలవాలి

రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు ఎంతో చాలెంజ్‌ అని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టభద్రుల ఓటు నమోదుపై 24 గ్రామాలకు చెందిన పార్టీ నేతలతో సమీక్షించారు. ప్రతి పట్టభద్రుడిని స్వయంగా కలిసి ఓటు నమోదు చేయించి, బీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థికే ఓటు పడేలా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి పాశ్చ భాషా, యాచారం పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ యాదయ్యగౌడ్‌, పార్టీ నేతలు జుట్టు శ్రీశైలం, లిక్కి నర్సింహారెడ్డి, పరికిషన్‌రెడ్డి, ఎండీ ఖాజు, శివకుమార్‌, పలు గ్రామాల సర్పంచులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement