● కారులో ప్రయాణిస్తున్న మహిళ మృతి
● మరో ఇద్దరికి గాయాలు
మొయినాబాద్: అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పైపులను ఢీకొట్టడంతో కారులో ఉన్న ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ప్రత్యూష(30) పెప్సికోలా కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆమె స్నేహితులు కౌశిక్‌కుమార్, భరద్వజ్, మరో ఇద్దరితో కలిసి మొయినాబాద్ మున్సిపాలిటీలోని అప్పోజీగూడ సమీపంలో లేక్‌వ్యూ ఫాంహౌస్‌కు వచ్చి పార్టీ చేసుకున్నారు. శనివారం ఉదయం రెండు కార్లలో నగరానికి బయలుదేరారు. గండిపేట చౌరస్తా వద్దకు వెళ్లగానే ప్రత్యూష ప్రయాణిస్తున్న కారు అతివేగంతో వెళ్లి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పైపులను ఢీకొట్టింది. దీంతో కారులోని వెనక సీట్లో ఉన్న ప్రత్యూష అక్కడికక్కడే మృతి చెందగా ముందు సీట్లో కూర్చున్న భరద్వజ్కు కాలు విరిగింది. కారు డ్రైవింగ్ చేస్తున్న కౌశిక్ కుమార్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


