యాచారం: నిబంధనలకు విరుద్ధంగా భారీగా నిల్వ ఉంచిన బాణసంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలివీ.. మండల పరిధిలోని మాల్‌లో కొమ్మటిశెట్టి పురుషోత్తం తన ఇంట్లో భారీగా బాణసంచాను నిల్వ ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందింది. గురువారం రంగంలోకి దిగి ఆకస్మికంగా దాడి చేసి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. పురుషోత్తంను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు.
యాలాల: మూర్ఛ వ్యాధితో కిందపడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని దౌలాపూర్ శివారులో బుధవారం జరిగింది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరుకు చెందిన రాముగౌడ్(47)కు మతిస్థిమితం సరిగ్గా లేదు. దీనికితోడు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈనెల 26న తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించగా, ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంతో అతని భార్య జ్యోతి తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేసింది. బుధవారం ఉదయం దౌలాపూర్ శివారులో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తు పట్టారు. మృతుడికి మూర్ఛ వ్యాధి ఉండటంతో కిందపడి చనిపోయి ఉంటాడని జ్యోతి యాలాల పోలీసులకు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసి ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
యాలాల: బైక్‌ను సిమెంటు ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని దౌలాపూర్ సమీపంలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని పగిడియాల గ్రామానికి చెందిన సతీష్(23) పని నిమిత్తం కొడంగల్‌కు వెళ్లి మధ్యాహ్నం బైక్‌పై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో దౌలాపూర్ సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా.. అజాగ్రత్తగా వస్తున్న సిమెంటు ట్యాంకర్ ఢీకొంది. ఈ ఘటనలో సతీష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
దౌల్తాబాద్: ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టం తగ్గిపోయిందని ఎవరూ బోర్లు వేయరాదని, ఒకవేళ వేస్తే కఠిన చర్యలు ఉంటాయని కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం దౌల్తాబాద్‌లో ఎంపీడీఓ ఉసెనప్ప అధ్యక్షతన మండల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జూన్ వరకు ఎల్‌నినో ప్రభావం ఉంటుందన్నారు. రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. ఇంకుడు గుంతలు, ఫాంపాండ్స్, రీచార్జ్ పిట్స్ నిర్మించుకోవాలని తెలిపారు. మండలంలో దెబ్బతిన్న రైతు వేదికల వివరాలు తెలియజేస్తే వాటి బాగుకు నిధులు మంజూరయ్యేలా చూస్తామన్నారు. ధాన్యం కొనుగోలు చేపట్టాలని సర్పంచ్‌లు కోరగా.. రెండు మూడు రోజుల్లో ప్రారంభిస్తామని ఏఓ తులసి తెలిపారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఉన్నాయని, పాత తీగలతో ఇబ్బందులు పడుతున్నామని సర్పంచులు తెలపగా వాటిని సరిచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏఈ మహిపాల్‌కు సూచించారు. వీబీజీరామ్‌జీ పథకం కింద గ్రామాల్లో పశుగ్రాసం పెంచేందుకు, పశువుల నీటితొట్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని పశువైద్యాఽధికారిణి వరలక్ష్మి చెప్పారు. గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పీఆర్, ఆర్‌అండ్‌బీ రోడ్లను వెంటనే పూర్తి చేయాలని కడా అధికారి ఆదేశించారు. వచ్చే నెల 7నుంచి 9వ తేదీ వరకు నియోజకవర్గంలోని హకీంపేటలో ప్రభుత్వం రాష్ట్రస్థాయి రైతుమేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సురేష్‌బాబు, ఏఈలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.


