కడ్తాల్: తరచూ మద్యం తాగి వచ్చి వేధింపులకు గురిచేయడంతో ఓ గృహిణి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండల పరిధిలోని మక్తమాధారంలో చోటు చేసుకుంది. సీఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మక్తమాధారం గ్రామానికి చెందిన ఎగిరిశెట్టి ఆంజనేయులుకు పదేళ్ల క్రితం కేశంపేట మండలం చింతకుంటపల్లి గ్రామానికి చెందిన లావణ్య(29)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నాలుగైదేళ్లుగా ఆంజనేయులు నిత్యం మద్యం తాగి వచ్చి భార్యను వేధింపులకు గురిచేసేవాడు. ఈ విషయమై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు పెట్టినా మార్పు రాలేదు. ఈ క్రమంలో బుధవారం రాత్రి మరోసారి మద్యం తాగి వచ్చిన ఆంజనేయులు భార్యతో గొడవపడ్డాడు. గురువారం ఉదయం మరోసారి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. దీంతో మనోవేదనకు గురైన లావణ్య ఇద్దరు కుమారులను పాఠశాలకు పంపి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్మకు పాల్పడింది. పాఠశాల నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన పిల్లలు తల్లిని చూసి బోరుమన్నారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి సుగుణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
మందు లేక వికారాబాద్‌కు తరలింపు
బొంరాస్‌పేట: పాముకాటుకు గురైన వ్యక్తిని కుటుంబ సభ్యులు కొడంగల్ ఆస్పత్రికి తీసుకరాగా మందు లేకపోవడంతో వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బొంరాస్‌పేట మండలం నాందార్‌పూర్‌కు చెందిన చోటే మియా పాముకాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే కొడంగల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ మందు లేకపోవడంతో వికారాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ లక్ష్మి, వార్డు సభ్యుడు శేఖర్ ఆస్పత్రికి వెళ్లి చోటేమియాను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. జిల్లా వైద్యాధికారులు స్పందించి కొడంగల్ ఆస్పత్రిలో పాముకాటు మందును అందుబాటులో ఉంచా లని సూచించారు.


