● రోడ్డెక్కిన పోచారంవాసులు
● గంటల తరబడి రాస్తారోకో
● తహసీల్దార్ హామీతో
శాంతించిన నిరసనకారులు
ఇబ్రహీంపట్నం రూరల్: కాలుష్యం నుంచి నుంచి తమను కాపాడాలని డిమాండ్ చేస్తూ బుధవారం పోచారం ప్రజలు రోడ్డెక్కారు. గంటల తరబడి రహదారిపై బైఠాయించారు. గ్రామంలోని రైస్‌మిల్లులు బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆందోళనకారులు మాట్లాడుతూ.. రైస్ మిల్లులు, ఫ్లైవుడ్ కంపెనీల నుంచి వెలువడుతున్న పొగ, కాలుష్యంతో ఇళ్లలోని ఆహార పదార్థాలు సైతం విషతుల్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామం మొత్తం ఎక్కడ చూసినా నల్లటి పొగ ముసురుతోందని తెలిపారు. అనేక మంది శ్వాసకోశ, కేన్సర్ తదితర రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే పలువురు కేన్సర్‌తో చనిపోయారన్నారు. ఈ విషయమై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
పెట్రోల్ బాటిల్‌తో యువకుడి హల్‌చల్
రాస్తారోకో జరుగుతున్న క్రమంలో గ్రామానికి చెందిన ఓ యువకుడు పెట్రోల్ బాటిల్‌తో హల్‌చల్ చేశాడు. సమస్య తీరకుంటే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతానని బాటిల్ మూత విప్పుతుండగా అక్కడే ఉన్న పోలీసులు, సర్పంచ్ వెంకటేశ్ బాటిల్ లాక్కుని దూరంగా పడేశారు.
భారీగా పోలీసుల మోహరింపు
రాస్తారోకో నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు భారీగా మోహరించారు. మంచాల సీఐ మధు ఆధ్వర్యంలో నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నంచేశారు. అయితే, కలెక్టర్ లేదా, రైస్‌మిల్లుల నిర్వాహకులు వచ్చి సమాధానం చెప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. తహశీల్దార్ సునీతారెడ్డి అక్కడికి చేరుకుని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ డైరెక్టర్ తుమ్మటి శ్రీశైలం యాదవ్, సర్పంచ్ తాళ్లపల్లి వెంకటేశ్, ఉప సర్పంచ్ కృష్ణ, నాయకులు గొరిగే రమేష్, భగీరథ సాగర్, డైరెక్టర్ లింగారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ శ్యాంసుందర్‌రెడ్డి, నాయకులు సంజీవరెడ్డి, శ్రీకూమార్‌రెడ్డి, చిన్నా, శ్రీశైలం, మహేందర్, రాజు, భరత్, గొరిగే వెంకటేశ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


