యువతి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

యువతి అదృశ్యం

Oct 29 2026 8:24 AM | Updated on Oct 29 2026 8:24 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: యువతి అదృశ్యమైన సంఘటన ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ రమేష్‌ కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం, తుర్కయంజాల్‌ ప్రభుత్వ పాఠశాల సమీపంలో సాజిదాబేగం మహ్మద్‌ అహ్మద్‌ కుటుంబం నివాసం ఉండేవారు. వీరి చిన్న కూతురు షహనాజ్‌బేగం ఇదే గ్రామానికి చెందిన మనీష్‌తో సన్నిహితంగా ఉండేది. గతంలో వీరిద్దరూ ఇంట్లో వాళ్లకు చెప్పకుండా వెళ్లిపోవడంతో వెతికి తీసుకువచ్చి, పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. అప్పటి నుంచి ఇద్దరూ దూరంగానే ఉన్నారు. ఇదిలా ఉండగా ఈనెల 27న పనులపై వెళ్లిన తల్లిదండ్రులు రాత్రి ఇంటికి తిరిగివచ్చారు. ఇంట్లో షహనా కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హాస్టల్‌కు వెళ్తున్నానని..

కేశంపేట: ఓ బాలుడి అదృశ్యం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం కాకునూరు గ్రామానికి చెందిన చాకలి నిఖిల్‌ చటాన్‌పల్లి శివారులోని గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతూ హాస్టల్‌లో ఉండేవాడు. ఈనెల 5న పరీక్షలు ఉన్నాయంటూ ఇంటి నుంచి వసతిగృహానికి బయల్దేరాడు. ఇదే రోజు సాయంత్రం బాలుడి నానమ్మ బాలమ్మ హాస్టల్‌ సిబ్బందిని ఆరా తీయగా అక్కడికి రాలేదని చెప్పారు. నిఖిల్‌ తల్లిదండ్రులు ఏడేళ్ల క్రితమే చనిపోవడంతో ఇతని సోదరిని స్థానిక పాఠశాలలో చదివిస్తున్న నానమ్మ, నిఖిల్‌ను హాస్టల్‌లో వేసింది. గతంలో కూడా నిఖిల్‌ ఇలాగే వెళ్లి రావడంతో వస్తాడులే అని ఊరుకుంది. ఇరవై ఐదు రోజులు కావస్తున్నా బాలుడి ఆచూకీ తెలియకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పరమేశ్‌ తెలిపారు.

క్షవరం చేసుకునేందుకు వెళ్లి..

క్షవరం చేసుకునేందుకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని పాటిగడ్డలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆదూరి రాజారెడ్డి ఈనెల 25న క్షవరం చేయించుకునేందుకు కొత్తపేట వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాలేదు. ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. బంధువులు, తెలిసిన వారి వద్ద వాకబు చేసిన రాజిరెడ్డి తమ్ముడు సుధాకర్‌రెడ్డి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్‌ కేసు నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement