విభేదాలు పక్కన పెట్టండి | - | Sakshi
Sakshi News home page

విభేదాలు పక్కన పెట్టండి

Oct 23 2026 7:24 AM | Updated on Oct 23 2026 7:24 AM

సాక్షి, రంగారెడ్డి జిల్లా: విభేదాలను పక్కన పెట్టి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అంతా కలిసికట్టుగా పని చేయాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతలకు సూచించారు. పాత, కొత్త నాయకులంతా సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో శంషాబాద్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కాంగ్రెస్‌ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అంతర్గతంగా ఎన్ని విభేదాలున్నా.. పక్కన పెట్టి, పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డి గెలుపు కోసం కృషిచేయాలన్నారు. అందివచ్చిన అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ చేజారనివ్వకూడని ఆదేశించారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో గెలిచేది, కాంగ్రెస్‌ అభ్యర్థేనని ధీమా వ్యక్తంచేశారు. అత్యధిక మెజార్టీ కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదును పార్టీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించే బాధ్యత నాయకులు, కార్యకర్తలదేనని గ్రామాలు, మున్సిపాలిటీలు, వార్డుల వారీగా ప్రత్యేక ఓటర్‌ ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ చేపట్టాలని, బూత్‌ స్థాయి నుంచి ప్రతి గ్రాడ్యుయేట్‌ ఓటరును కలిసి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి వివరించాలని, బీఆర్‌ఎస్‌, బీజేపీ వైఫల్యాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్‌, ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు వజ్రేష్‌ యాదవ్‌, వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్‌, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, పార్టీ సీనియర్‌ నాయకులు హాజరయ్యారు.

అభ్యర్థి మీరే

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయానికి ప్రతీ నాయకుడు, కార్యకర్త తానే అభ్యర్థిగా భావించి కష్టపడి పనిచేయాలని ఆలిండియా ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ మధుయాస్కిగౌడ్‌ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచుకోవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లా నుంచి అత్యధికంగా పట్టభద్రుల ఓటరు నమోదును చేపట్టి, పార్టీ అభ్యర్థి విజయంపై ముఖ్యమంత్రికి విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తే.. జిల్లాకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలిపారు. పార్టీ కోసం కష్టపడే నాయకులు, కార్యకర్తలకు నామినేటెడ్‌ పదవుల రూపంలో తగిన గుర్తింపు లభిస్తుంది.

కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయండి

జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి శ్రీధర్‌బాబు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement