● ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలి
● అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి
● కలెక్టరేట్‌లో జయంతి వేడుకలు
మొయినాబాద్: నిజాం, భూస్వాములు, దేశ్‌ముఖ్‌ల అరాచకాలను ఎండగడుతూ బడుగులకోసం పోరాటం చేసిన గొప్ప మానవతావాది పండుగల సాయన్న అని అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం పండుగ సాయన్న జయంతి వేడుకలను కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ పండుగల సాయన్న అసమానతలు లేని సమాజం కావాలని కోరుకున్నారని.. ప్రతిఒక్కరూ ఆయన ఆశయాల సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఫ్రంట్ చైర్మన్ జి.మల్లేష్‌యాదవ్, జిల్లా పరిపాలనాధికారి సునీల్, బీసీ సంక్షేమ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ కేశురాం, ముదిరాజ్ మహాసభ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నారాయణపురం మహేందర్‌ముదిరాజ్, నాయకులు వేణుగోపాల్, లక్ష్మణ్ ముదిరాజ్, బంది అనిల్, ఆలూరి వెంకట్, అధికారులు, సిబ్బంది ఉన్నారు.


