సాక్షి, రంగారెడ్డిజిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధిస్తూ, మానవాళిని ప్రకృతికి దగ్గర చేసే గొప్ప వేడుక అని ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) ఆవరణలో గురువారం మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మెప్మా, అడల్ట్ ఎడ్యుకేషన్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూజలు నిర్వహించి, వేడుకలను ప్రారంభించారు. మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు ఎంతో ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రకృతిని గౌరవిస్తూ, మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి శాంతిశ్రీ, అడల్ట్ ఎడ్యుకేషన్ అధికారి అనిత, వైద్య ఆరోగ్య శాఖ, మెప్మా, రెవెన్యూ తదితర శాఖలకు చెందిన మహిళా అధికారులు, సీడీపీఓలు, ఇతర ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి


