సాక్షి, రంగారెడ్డిజిల్లా: కలెక్టర్ నారాయణరెడ్డి సెలవులో వెళ్లారు. ఈ నెల 14 నుంచి 20 వరకు వ్యక్తిగత పనులపై లీవ్లో వెళ్లినట్లు తెలిసింది. ఆయన స్థానంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కిరణ్మయికి బాధ్యతలు అప్పగించారు. దసరా సెలవుల తర్వాత ఆయన తిరిగి విధుల్లో చేరనున్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్: ఆదిభట్ల పోలీస్స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా వైకే ప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఐ రమేష్ నాయకత్వంలో నేరాల అదుపునకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. సంఘ విద్రోహ కార్యక్రమాలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. నేరాలను అదుపు చేయడానికి ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనుల తీరు బాగుందని ఎన్ఐఆర్డీ బృందం కితాబిచ్చింది. మండలంలోని పోచారంలో గురువారం ఒడిశా, గుజరాత్, జమ్మూకశ్మీర్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన బ్లాక్ డెవలప్మెంట్ అధికారుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనుల ద్వారా చేపట్టిన నర్సరీ, పంచాయతీ భవనం, పల్లె ప్రకృతి వనం, చెత్త వేరు చేసే షెడ్, ఇందిరమ్మ ఇళ్లు, ఇంకుడు గుంతలు, స్వయం సహాయక సంఘాల పని తీరును పరిశీలించారు. జాతీయ గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా ఎన్నో పనులు చేపట్టడం సంతోషమన్నారు. ఇలాంటి పనులు భవిష్యత్తులో ఇంకా అమలు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రమీలా నాయక్, ఏపీఓ తిరుపతాచారి తదితరులు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్మెట్: పిగ్లీపూర్లోని సర్వేనంబర్ 17లో ఉన్న రూ. 50 కోట్ల విలువ చేసే సీలింగ్ భూమి ఆక్రమణకు గురవుతోందని బాటసింగారం ఎంపీటీసీ మాజీ సభ్యుడు బండిగారి విష్ణుగౌడ్ గురువారం అదనపు కలెక్టర్ కిరణ్మయికి ఫిర్యాదు చేశారు. పిగ్లీపూర్ గ్రామం నుంచి సాయినగర్ కాలనీకి వెళ్లే దారిలో ఉన్న సుమారు 7 ఎకరాల సీలింగ్ భూమికి సంబంధం లేని వ్యక్తుల పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించి విక్రయించేందుకు కొంతమంది రియల్ ముఠాసభ్యులు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆక్రమించుకోవడంతో పాటు కోట్లాది రూపాయల విలువైన గ్రానైట్, మట్టిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆక్రమణకు గురవుతున్న సీలింగ్ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.


