పార్టీ పటిష్టతకు కృషి చేస్తా | - | Sakshi
Sakshi News home page

పార్టీ పటిష్టతకు కృషి చేస్తా

Oct 16 2026 10:46 AM | Updated on Oct 16 2026 10:46 AM

పార్టీ పటిష్టతకు కృషి చేస్తా

● కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు

● డీసీసీ అధ్యక్షురాలిగా చిగురింత పారిజాత బాధ్యతల స్వీకరణ

● మంత్రి పొన్నం, సీనియర్‌ నేత వీహెచ్‌, పలువురు నేతలు హాజరు

● చర్చనీయాంశంగా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల గైర్హాజరు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘జిల్లాలో పార్టీ పటిష్టత కోసం మరింత కష్టపడి పని చేస్తా.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో సమన్వయంతో ముందుకు వెళ్తా.. కష్టకాలంలో పార్టీని నమ్ముకుని పని చేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు దక్కేలా చూస్తా.. కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ, యోగక్షేమాలు చూసుకుంటా’ అని డీసీసీ అధ్యక్షురాలు చిగురింత పారిజాత స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం 11 గంటలకు గాంధీ భవన్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆమె డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. తొమ్మిదేళ్లుగా అధ్యక్షుడిగా కొనసాగుతున్న చల్లా నరసింహారెడ్డి పార్టీ పగ్గాలను పారిజాతకు అప్పగించారు. కార్యక్రమానికి బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, సీనియర్‌ నేత వి.హన్మంతరావు సహా పలువురు జిల్లా నేతలు హాజరయ్యారు. వేదమంత్రాల సాక్షిగా పారిజాతను డీసీసీ కుర్చీలో కూర్చోబెట్టారు. పుష్పగుచ్ఛాలు, శాలువాలతో ఘ నంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పార్టీ పగ్గాలు అప్పగించిన అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం పాటు పడే ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ పార్టీనే అంటిపెట్టుకుని ఉండి, అధికారంలోకి తీసుకొచ్చిన సగటు కార్యకర్తకు పదవుల్లో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి), వీర్లపల్లి శంకర్‌ (షాద్‌నగర్‌) సహా బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మహేశ్వరం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి భీంభరత్‌, ఇతర సీనియర్‌ నేతలెవరూ కార్యక్రమానికి హాజరు కాకపోవడం అంతర్గత చర్చకు దారితీస్తోంది. పార్టీలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయనే చర్చ సైతం ప్రారంభం కావడం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement