మీర్‌పేట: డ్రైవర్ బీపీ తగ్గి స్పృహ కోల్పోవడంతో స్కూల్ బస్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటన మీర్‌పేట ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం అల్వాల్‌లోని పల్లవి మోడల్ స్కూల్ బస్ 17 మంది విద్యార్థులను మీర్‌పేట, జిల్లెలగూడ, అల్మాస్‌గూడ ప్రాంతాలలో దించేందుకు వచ్చింది. 15 మంది విద్యార్థులను దించి తిరిగి వెళ్తుండగా జిల్లెలగూడ లలితానగర్ చౌరస్తా వద్దకు రాగానే బస్సు డ్రైవర్‌కు బీపీ తగ్గి స్పృహ కోల్పోవడంతో డివైడర్‌ను ఢీకొట్టి ఆగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు టీచర్లు, విద్యార్థులు, ఆయాకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బస్సు వేగంగా ఢీ కొట్టడంతో రహదారి మధ్యలోని విద్యుత్ స్తంభం విరిగిపడింది. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఇన్‌స్పెక్టర్ శోభన్ వివరణ ఇచ్చారు.
డివైడర్‌ను ఢీ కొట్టి నిలిచిపోయిన స్కూల్ బస్


