ఇబ్రహీంపట్నం రూరల్: భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ నాయకులు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల జీహెచ్‌ఎంసీ పరిధిలో పారిశ్రామిక సంస్థ సెజ్‌లో టాటా ఏరోస్పేస్, టీసీఎస్, టాటా లాకీడ్‌మార్టీన్, టాటా సికోస్కీ, వీహెచ్ 64 ఆపాచీ హెలిక్యాప్టర్ విడి భాగాల తయారీ యూనిట్, ఇబ్రహీంపట్నంలో ఎన్‌ఎస్‌జీ, ఆక్టోఫస్, బీడీఎల్, సంస్థలకు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు తీసుకున్నారని.. భూములు కోల్పోయిన బాఽధితులకు మాత్రం సరైన న్యాయం చేయలేదన్నారు. ఎకరాకు 500 గజాల ప్లాటు, కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఈ భూముల్లో ఏర్పాటు చేసే సంస్థల్లో 70 శాతం స్థానికులకే ఉద్యోగాలు కేటాయించాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు కొండ్రు రఘుపతి, చెరుకూరి కరుణాకర్, చింతపట్ల నాగేశ్, మహేందర్, రాములు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆలయ భూమి కబ్జాపై ఫిర్యాదు
యాచారం: మండల పరిధిలోని నందివనపర్తి గ్రామంలో ఓ రియల్టర్ ఆలయ భూమిని కబ్జా చేసి వెంచర్ చేస్తున్నాడని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఓ రియల్ వ్యాపారి పురాతన శివాలయం, పోచమ్మ తల్లి ఆలయాల స్థలాలను చూపుతూ పది శాతం పార్క్ స్థలం వదలకుండా వెంచర్ చేస్తున్నాడని గ్రామానికి చెందిన బీజేపీ నేత గోగికార్ రమేశ్ కలెక్టర్ నారాయణరెడ్డికి వివరించారు. వెంచర్‌లో పది శాతం పార్క్ స్థలం వదిలేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు స్పందించిన ఆయన ప్రజావాణిలోనే ఉన్న డీపీఓ సురేష్‌మోహన్‌ను పిలిచి వెంటనే నందివనపర్తిలోని వెంచర్ పనులను నిలిపి వేయించాలని సూచించారు. అనంతరం ఆయన గ్రామస్తులతో కలిసి మీర్‌ఖాన్‌పేటలో ఉన్న ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలోని అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు
మంచాల: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పక్రియలో స్థానిక ప్రజా ప్రతినిధులకు ప్రాధాన్యత కల్పించాలని తాళ్లపల్లిగూడ సర్పంచ్ జోగు శంకరయ్య కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. సర్పంచ్ ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఇందిరమ్మ ఇళ్ల జాబితాను రూపొందిస్తున్నారని.. గ్రామసభ ఆమోదం, పంచాయతీ తీర్మాణం లేకుండా అధికార పార్టీకి చెందిన వారు లబ్ధిదారులను ఎంపిక చేయడం సరికాదన్నారు. నిరుపేదలకు ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సర్పంచ్ వెంట ఉపసర్పంచ్ రాజేశ్, వార్డు సభ్యులు మల్లేశ్, యాదయ్య తదితరులు ఉన్నారు.
కలెక్టర్‌కు విన్నవించిన బీఎస్‌పీ నాయకులు


