మహేశ్వరం: మూడేళ్ల కుమారుడితో కలిసి గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన ఎంబీ కలాన్ భార్య రవీనా బీబీ, కుమార్తె ముస్కాన్ కాటూన్ (19), మనుమడు మహ్మద్ యాసన్ (3)తో కలిసి జీవనోపాధి నిమిత్తం జల్‌పల్లికి వచ్చి నివాసం ఉంటున్నాడు. ముస్కాన్‌కు మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 22న ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమారుడితో కలిసి బయటికి వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. ఈ విషయమై తల్లి బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో గానీ, 87126 62367 నంబర్‌లోగానీ సమాచారం ఇవ్వాలని సూచించారు.
శంకర్‌పల్లి: ఆస్తి కోసం తండ్రిపై రాయితో దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడిన కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించారు. ఈ ఘటన శంకర్‌పల్లి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రుధ్వీర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లక్ష్మారెడ్డిగూడ గ్రామానికి చెందిన రాములు (70), అంజమ్మ దంపతులు. వీరికి కుమారుడు శ్రీనివాస్ (35) ఉన్నాడు. రాములుకి గ్రామంలో వారసత్వంగా వచ్చిన ఐదెకరాల భూమి ఉంది. దానిని తన పేరుపై చేయాలని మూడేళ్లుగా కొడుకు తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తూ, వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 18న బండరాయితో తండ్రిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తల్లి అంజమ్మ ఈనెల 20న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకొని, చేవెళ్ల కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ నిమిత్తం సంగారెడ్డి జిల్లా జైలుకి తరలించారు.


