● కలెక్టర్ నారాయణరెడ్డి
● ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ
ఇబ్రహీంపట్నం రూరల్: సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రజావాణి నిర్వహిస్తున్నామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 84 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు కిరణ్మయి, చంద్రారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి శారద, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అడ్డుకుని పూడ్చివేసిన రైతులు
శంకర్‌పల్లి: ప్రభుత్వం తాము సాగుచేసుకోవడానికి ఇచ్చిన అసైన్డ్ భూముల్లో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వరద కాలువల నిర్మాణం చేపట్టారంటూ మోకిల రైతులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. రెవెన్యూ, నీటిపారుదల అధికారులకు సమాచారం ఇచ్చారు. తర్వాత జేసీబీతో అనుమతి లేకుండా తవ్విన వరద కాలువని పూడ్చివేయించారు. రైతుల ఫిర్యాదుతో కాలువ తవ్విన స్థలానికి నీటిపారుదల శాఖ ఏఈ వరప్రసాద్ చేరుకొని పరిశీలించారు. ఎలాంటి అనుమతులు లేవని, మళ్లీ ఎవరన్నా తవ్వితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఇబ్రహీంపట్నం రూరల్: మైనింగ్ లీజుల ప్రీ–ఆక్షన్ ప్రక్రియ పకడ్బందీగా అమలు చేయాలని అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన మైనింగ్ ప్రీ–ఆక్షన్ కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మైనింగ్‌కు సంబంధించిన ప్రతిపాదనలను అంశాల వారీగా పరిశీలించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో అవసరమైన అనుమతులు, ఎన్‌ఓసీల వంటి అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించడం జరిగిందన్నారు. మైనింగ్ లీజుల ప్రీ–ఆక్షన్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. త్వరితగతిన పరిశీలించి అనుమతులకు సంబంధించి నివేదికలు తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో మైనింగ్, టీజీఐఐసీ, అటవీ, పర్యావరణ, భూగర్భ జలాలు, నీటిపారుదల తదితర శాఖల అధికారులతో పాటు ఆర్డీఓలు, కందుకూరు, ఆమనగల్లు, యాచారం, మంచాల, తహసీల్దార్లు పాల్గొన్నారు.


