హయత్‌నగర్ పోలీస్ స్టేషన్
వద్ద బాధితులు
హయత్‌నగర్: ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో లాభాలు పొందొచ్చని నమ్మించి వందలాది మంది అమాయకుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం.. హయత్‌నగర్ సీఎస్‌ఆర్ కాలనీకి చెందిన వెంకటేశ్వరప్ప కాలనీలో నివసించే వారికి క్యూవీఎస్‌వీ అనే యాప్‌ను పరిచయం చేస్తూ ఆ యాప్ ద్వారా పెట్టుబడులు పెడితే అధిక ఆదాయం పొందొచ్చని చెప్పాడు. పెట్టుబడులు పెట్టిన కొంతమందికి డబ్బులు వచ్చినట్లు నమ్మించాడు. నమ్మిన కాలనీవాసులు వారి చుట్టాలు, స్నేహితులతో సైతం పెట్టుబడి పెట్టించారు. చేతిలో డబ్బులు లేకున్నా బంగారు నగలు కుదువపెట్టి, అప్పులు చేసి మరీ డబ్బులు పెట్టారు. ఇలా సుమారు 800 మంది నుంచి వెంకటేశ్వరప్ప సుమారు రూ.5 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టించినట్లు తెలుస్తోంది. ఉన్నట్టుండి యాప్ ఒకేసారి క్లోజ్ కావడంతో ఖంగుతిన్న బాధితులు వెంకటేశ్వరప్పను నిలదీశారు. దీంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించాడు. దీంతో బాధితులంతా ఒక్కొక్కరుగా హయత్‌నగర్ పోలీస్టేషన్‌కు చేరుకుని తమ గోడు వినిపిస్తున్నారు. దీనిపై సమాచారం ఉన్నా.. ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ శంకరయ్య తెలిపారు.


