3 నగరాల మీదుగా 4 దేశాలకు.. | - | Sakshi
Sakshi News home page

3 నగరాల మీదుగా 4 దేశాలకు..

Sep 22 2026 10:02 AM | Updated on Sep 22 2026 10:02 AM

సీఫుడ్‌ ముసుగులో తరలిపోతున్న ఇక్కడి ‘చోరీ సెల్‌ఫోన్లు’

థర్మకోల్‌ పెట్టెల్లో ప్యాక్‌ చేసి విదేశాలకు అక్రమ రవాణా

చోరీ ఫోన్లు కొనడానికి ప్రధాన నగరాల్లో అనేక ముఠాలు

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో చోరీ అవుతున్న సెల్‌ఫోన్లు సీఫుడ్‌ ముసుగులో దేశం దాటేస్తున్నాయి. ప్రధానంగా మూడు నగరాల మీదుగా నాలుగు దేశాలకు వ్యవస్థీకృతంగా సాగుతున్న అక్రమ రవాణా వెనుక స్థానికుల నుంచి విదేశీయుల వరకు ఉంటున్నారు. వాట్సాప్‌ గ్రూపుల ద్వారా చోరీ ఫోన్ల ఫొటోలు షేర్‌ చేసుకుని, బేరసారాల తర్వాత క్రయవిక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓడ రేవుల్లో కార్యకలాపాలు సాగించే వారితో పాటు సరిహద్దు గ్రామాలకు చెందిన ప్రజలు సైతం ఈ స్మగ్లింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు అనుమానాలున్నాయి. అరటి బోదెల సాయంతో జరుగుతున్న విధానం దీనికి అదనం.

చోరుల నుంచి స్థానిక వ్యాపారుల వద్దకు..

వివిధ ప్రాంతాలకు చెందిన చిన్న చిన్న ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఆటోడ్రైవర్లు కలిసి ముఠాలుగా ఏర్పడుతున్నారు. వీళ్లంతా ప్రాంతాల వారిగా తిరుగుతూ బస్సులు, బస్టాపులు, వైన్‌షాపులు, బహిరంగ సభలు జరిగే చోట్లతో పాటు అనేక రద్దీ ప్రాంతాల్లో సెల్‌ఫోన్లు తస్కరిస్తున్నారు. ఈ చోరీ ఫోన్లను వివిధ ప్రాంతాల్లో ఉన్న సెల్‌ఫోన్‌ మార్కెట్లలోని కొందరు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఈ ఫోన్లు అన్‌లాక్‌ చేయడం కోసం ప్రత్యేకంగా టెక్నీషియన్లు పని చేస్తున్నారు. నగరంలో చోరీ ఫోన్లు ఖరీదు చేస్తున్న వ్యాపారులు, ఢిల్లీ, ముంబై, చైన్నె, కోల్‌కతాల్లో ఉన్న ‘హోల్‌సేల్‌ వ్యాపారులకు’ కలిపి ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు ఉంటున్నాయి. ఇక్కడి వ్యాపారులు తమ వద్ద అందుబాటులో ఉన్న ఫోన్ల ఫొటోలను వాటిలో పోస్టు చేస్తున్నారు.

పార్సిల్‌ ద్వారా మెట్రో నగరాలకు..

ఆయా వాట్సాప్‌ గ్రూపుల్లో వివిధ నగరాలకు చెందిన అనేక మంది చోరీ ఫోన్లు కొనే వ్యాపారులు ఉంటారు. బేరసారాల తర్వాత ఇక్కడి వ్యాపారులు అక్కడి వారు కోరిన వాటిని పార్శిల్‌ చేసి తమ మనుషులకు ఇచ్చి పంపిస్తున్నారు. ఇలా ఢిల్లీ, ముంబై, చైన్నె, కోల్‌కతా నగరాల్లోని వ్యాపారుల వద్దకు చేరుతున్నాయి. సూడాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌ల్లో ఉన్న వ్యాపారులతో వీరికి ఉమ్మడి వాట్సాప్‌ గ్రూపులు ఉంటున్నాయి. వాటిలో పోస్టు అవుతున్న ఫోన్ల ఫొటోల ఆధారంగా అక్కడి వారు ఎంచుకుంటున్నారు. ఆ సెల్‌ఫోన్లను ఇక్కడి వ్యాపారులు ప్రత్యేకంగా ప్యాక్‌ చేస్తున్నారు. తొలుత ఐదేసి ఫోన్లు చొప్పున ట్రాన్స్ఫరెంట్‌ బాక్సుల్లో పెట్టి పార్శిల్‌ చేస్తున్నారు. ఇలాంటి 20 నుంచి 25 బాక్సుల్లో పెట్టి థర్మకోల్‌ పెట్టెల్లో ప్యాక్‌ చేస్తున్నారు. ఆపై అది సీఫుడ్‌ అంటూ ఆయా దేశాలకు పంపిస్తున్నారు.

ఈ రెండు దేశాలకు సరిహద్దులు దాటించి..

చోరీ సెల్‌ఫోన్లు సూడాన్‌, శ్రీలంకలతో పాటు బంగ్లాదేశ్‌, నేపాల్‌లకు ఎక్కువగా వెళ్తున్నాయి. ఈ రెండు దేశాలకు మాత్రం థర్మకోల్‌ పెట్టెల్లోనే పార్సిల్‌ చేసి అరటి బోదెల సాయంతో సరిహద్దు గ్రామాలకు చెందిన వారి ద్వారా స్మగ్లింగ్‌ చేస్తున్నారు. రెండు వైపులా ఉండే సరిహద్దు గ్రామాలకు చెందిన కమీషన్‌ ఎజెంట్లు ఈ వ్యవహారం పర్యవేక్షిస్తున్నారు. కోల్‌కతా నుంచి తమ వద్దకు వస్తున్న ఫోన్లను ఆవలి వైపు ఉన్న వారికి చేరవేస్తూ కమీషన్లు తీసుకుంటున్నారు. దీనికోసం సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేకంగా కొన్ని ముఠాలు పని చేస్తున్నాయి. వీరికి ఒక్కో ఫోన్‌కు దాని మోడల్‌ ఆధారంగా రూ.100 నుంచి రూ.500 వరకు కమీషన్‌గా లభిస్తోంది. సీఫుడ్‌ పేరుతో వెళ్తున్న థర్మకోల్‌ బాక్సుల్ని తనిఖీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారా? లేక స్మగ్లర్లతో మిలాఖత్‌ అయి ఉన్నారా? అనేది తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement