● ఇద్దరు రైతులకు గాయాలు
● ఓ ఎద్దు మృతి
తాండూరు రూరల్: మండల పరిధిలోని చంద్రవంచ, మిట్టబాసుపల్లి గ్రామాల్లో సోమవారం పిడుగు పడింది. ఈ ఘటనలో ఓ రైతుకు గాయాలవగా, ఓ ఎద్దు మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మిట్టబాసుపల్లికి చెందిన రైతు మాల అమృతప్ప వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. సోమవారం తన ఎద్దులను మేత కోసం పొలానికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురు గాలులు, మెరుపులతో కూడిన పిడుగు పడింది. దీంతో ఓ ఎద్దు అక్కడికక్కడే కక్కడే మృతి చెందింది. కొద్ది దూరంలో ఉన్న అమృతప్పకు స్వల్ప గాయాలయ్యాయి. ఎద్దు మృతితో రూ.లక్ష నష్టం వాటిల్లిందని, అరక ఆగిపోయిందని బాధిత రైతు గంగమ్మ వాపోయింది.
మరో ఘటనలో..
చంద్రవంచ గ్రామానికి చెందిన రైతు నాగప్ప. కంది పొలంలో గుంటుక తోలుతుండగా సమీపంలో పిడుగు పడింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని తాండూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
‘ప్రమాణానికి’ దూరం!
బషీరాబాద్: నావంద్గీ సొసైటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అధికార కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలపై చర్చకు తెరతీసింది. సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు గైర్హాజరు కావడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపింది. పార్టీ కోసం పనిచేసిన నాయకులకు పదవుల పంపకాల్లో, పార్టీ వ్యవహారాల్లో తగిన ప్రాధాన్యం దక్కడం లేదని, ముఖ్యంగా సొసైటీ చైర్మన్ ఎంపికపై తీవ్ర అసంతృప్తి కారణంగానే ముఖ్య నేతలు కార్యక్రమానికి దూరంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా.. అసంతృప్త నేతలు కొందరు సోమవారం కాంగ్రెస్ జిల్లా పెద్దలను రహస్యంగా కలిసి తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లో వారంతా ఒకచోట సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆతర్వాత వీరి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది మండలంలో చర్చనీయాంశంగా మారింది.
జనం నోట.. టీఆర్‌ఎస్ మాట
కవిత పర్యటన, వ్యాఖ్యలపై ప్రజల్లో చర్చ
బొంరాస్‌పేట: టీఆర్‌ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ పర్యటన, పాంచజన్య సంకల్ప సభ ప్రజల్లో హాట్ టాపిక్‌గా మారింది. సభలో కవిత మాట్లాడిన లగచర్ల ఘటనకు సంబంధించిన మాటలు చర్చనీయాంశమయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని కోస్గి పట్టణంలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో కవిత సామాజిక న్యాయం అంశం గురించి మాట్లాడుతూ.. మా లంబాడా సోదరులిక్కడ చాలా మంది ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా అడుగుతా వున్నా.. మీ అల్లుడిగారికి సిమెంటు ఫ్యాక్టరీ ఇవ్వాలని లగచర్లలో కరెంటు బంద్ చేసి మీ పోలీసులు చేసిన దాష్టీకం సామాజిక అన్యాయమా, కాదా’? మా లంబాడి ఆడబిడ్డలపైన చేసిన దాష్టీకం సామాజిక అన్యాయమా, కాదా.. దాన్ని ప్రశ్నించొద్దా? అంటూ కవిత మాట్లాడిన మాటలు లగచర్ల ఘటనను బాధితులకు మరోసారి గుర్తుచేసినట్లయింది. దీనిపై అధికార పార్టీ నేతలు, నాయకులు స్పందించి ప్రతివిమర్శలు చేస్తున్నారు. పాంచజన్యం అంటే కేసీఆర్ కుటుంబంలో ఐదుగురు నేతల రాజకీయ ఆరాట సంకల్పమని ఎద్దేవా చేయడం గమనార్హం.


