● ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
● కొందుర్గులో రోడ్‌షో
కొందుర్గు: రాష్ట్రంలో బీసీలే రాజ్యాధికారం చేపట్టాలని రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. గోల్కొండ కోట నుంచి చేపట్టిన మహా పాదయాత్ర సోమవారం కొందుర్గు, లాల్‌పహాడ్ నుంచి చౌదరిగూడ చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. రాజ్యాధికార పార్టీ అగ్రకులాలకు వ్యతిరేకమన్నారు. అతి తక్కువ శాతం ఉన్న ఆయా సామాజికవర్గాల ఓట్లు తమకు అక్కర్లేదన్నారు. 90శాతానికి పైగా ఓట్లు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలైన బహుజనులకే రాజ్యాధికారం దక్కాలని స్పష్టంచేశారు. 2028 ఎన్నికల్లో రాజ్యాధికార పార్టీ రాజ్యమేలడం ఖాయమన్నారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకొని రాజ్యమేలుతున్నారని ఆరోపించారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రజలని నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సేవలు, సిబ్బంది వివరాలను డాక్టర్ తబుసుమ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యాధికార పార్టీ కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండల అధ్యక్షుడు దర్గ వెంకటయ్య, రాములు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


