నేడు లబ్ధిదారులకు ఆర్థికసాయం అందజేత | - | Sakshi
Sakshi News home page

నేడు లబ్ధిదారులకు ఆర్థికసాయం అందజేత

Sep 4 2026 7:35 AM | Updated on Sep 4 2026 7:35 AM

నేడు లబ్ధిదారులకు ఆర్థికసాయం అందజేత సైబర్‌ నేరాలపై అవగాహన అవసరం దివ్యాంగుల పునరావాస కేంద్రం తనిఖీ తెలుగు అధ్యాపకురాలికి పురస్కారం

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకంలో భాగంగా బుధవారం లబ్ధిదారులకు ఆర్థికసాయం అందజేయనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నవీన్‌కుమార్‌ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఉదయం 11 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరుకానున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 278 మంది లబ్ధిదారులకు రూ.50 వేల చొప్పున అందజేస్తారని చెప్పారు. లబ్ధిదారులు సకాలంలో హాజరుకావాలని సూచించారు.

పహాడీషరీఫ్‌: సైబర్‌ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని ఆర్‌జీఐఏ డివిజన్‌ ఏసీపీ వి.శ్రీకాంత్‌ గౌడ్‌ సూచించారు. పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి హార్డ్‌వేర్‌ పార్కు ఫేజ్‌–1లోని అమేజాన్‌ కంపెనీలో మంగళవారం ఉద్యోగులకు సైబర్‌ క్రైమ్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌ బి.లక్ష్మీనారాయణ రెడ్డితో కలిసి ఏసీపీ మాట్లాడారు. సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాను ఎంచుకొని అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారని అన్నారు. ఆన్‌లైన్‌ ఫైనాన్షియల్‌ మోసాలు, ఆకర్షించే లింక్‌లు, సామాజిక మాధ్యమాల మోసాలు, డిజిటల్‌ అరెస్ట్‌ల పేరిట బెదిరింపులపై కనీస అవగాహన అవసరమన్నారు. ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్‌లకు సంబంధించిన పిన్‌, సీవీవీ నంబర్లను ఎట్టి పరిస్థితుల్లో షేర్‌ చేయొద్దని, అనుమానాస్పద లింక్‌లను ఓపెన్‌ చేయకుండా చూసుకోవాలన్నారు. పొరపాటున సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేయాలన్నారు. సమావేశంలో ఎస్‌ఐ దయాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.

హుడాకాంప్లెక్స్‌: సరూర్‌నగర్‌లోని దివ్యాంగుల పునరావాస కేంద్రాన్ని మంగళవారం దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకుడు సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుద్ధిమాంద్యం పిల్లలకు అందిస్తున్న చికిత్స, సేవలను నోడల్‌ ఆఫీసర్‌ రమేశ్‌, పునరావాసకేంద్రం అధికారి అతుల్‌ శ్రీవాస్తవ ఆయనకు వివరించారు. కేంద్రంలో అందిస్తున్న సేవా కార్యక్రమాలపై సత్యనారాయణ సంతృప్తి వ్యక్తం చేశారు. తనవంతు సహాయసహకారాలు అందిస్తానని తెలిపారు.

షాద్‌నగర్‌రూరల్‌: పట్టణ సమీపంలోని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో తెలుగుభాష అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న రాజేశ్వరి రాసిన కవితకు పురస్కారం దక్కింది. నగరంలోని కోఠిలో స్థాపించిన శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం 125వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవితలు, వ్యాసాల పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కవులు, రచయితలు హాజరయ్యారు. పోటీల్లో రాజేశ్వరి రాసిన కవితను ఉత్తమ కవితగా ఎంపిక చేసి శ్రీకృష్ణదేవరాయ భాషానిలయం వారి ప్రత్యేక సంచికలో ముద్రించారు. విశ్రాంత ఐఏఎస్‌ రమణాచారి, తెలంగాణ గ్రంథాలయ కార్యదర్శి రియాజ్‌, పాలపిట్ట మ్యాగజిన్‌ సంపాదకుడు గుడిపాటి వెంకటాచలం ఆమెకు పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement