సాక్షి, సిటీబ్యూరో: నగర శివారు ప్రాంతాల్లో రహదారి కనెక్టివిటీని మరింత బలోపేతం చేసేందుకు జీహెచ్‌ఎంసీ కీలక అడుగులు వేస్తోంది. ఇందుకోసం మాస్టర్‌ప్లాన్‌లో మార్పులకూ ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న రోడ్ల మధ్య ఏర్పడిన మిస్సింగ్ లింక్‌లను గుర్తించి కొత్త రోడ్ల నిర్మాణం, రోడ్డు వెడల్పుల పెంపు, అవసరమైన చోట్ల భూసేకరణకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మంగళవారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించి ఐదు రోడ్డు అభివృద్ధి ప్రతిపాదనల్లో 595 ఆస్తులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. నిబంధనలు, చట్టాల మేరకు వాటిని సేకరించనున్నారు.
ఎక్కడెక్కడ?
● బైరాగిగూడ–నార్సింగి: గ్రీన్‌వ్యాలీ నుంచి ఆర్మీ పబ్లిక్ స్కూల్ వరకు 30 మీటర్ల వెడల్పుతో మిస్సింగ్ లింక్ రోడ్డు.
● బడంగ్‌పేట్–నాదర్‌గుల్: బడంగ్‌పేట్ మెయిన్ రోడ్ నుంచి రామాలయం–నాదర్‌గుల్ మీదుగా వెళ్లే 925 మీటర్ల మార్గాన్ని 30 మీటర్ల వెడల్పుతో అభివృద్ధి చేయనున్నారు. బడంగ్ మెయిన్ రోడ్ నుంచి నాదర్‌గుల్ రోడ్ వరకు మరో మిస్సింగ్ లింక్ 30 మీటర్ల వెడల్పుతో అభివృద్ధి.
● తొండుపల్లి–ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్: ఎన్‌హెచ్–44 తొండుపల్లి జంక్షన్ నుంచి ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్ వరకు 24, 36 మీటర్ల వెడల్పుతో రోడ్డు.
● తొర్రూరు–నాగార్జునసాగర్ రోడ్: ఇప్పటికే మాస్టర్‌ప్లాన్‌లో ఉన్న 18 మీటర్ల రోడ్డును 30 మీటర్లకు పెంచనున్నారు. ఇంజాపూర్ లేక్ నుంచి రామ్‌జీ చాయ్ హోటల్ వరకు మార్గంలో 135 ఆస్తులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
ఇది కేవలం రోడ్డు విస్తరణ కాదు.. మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు
ఈ మిస్సింగ్ లింక్ రోడ్లను మాస్టర్‌ప్లాన్‌లో చేర్చాలని, అవసరమైన చోట్ల ప్రస్తుత రోడ్డు వెడల్పులను పెంచా లని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. అంటే శివారు ప్రాంతాల్లో భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ నెట్‌వర్క్‌ను ఇప్పుడే రీడిజైన్ చేసే ప్రక్రియ మొదలైనట్టే.మరోవైపు రోడ్ల కోసం ప్రభావితమయ్యే ఆస్తుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ముఖ్యంగా బడంగ్‌పేట్–తుర్కయంజాల్ మార్గంలో 216, బడంగ్‌పేట్–నాదర్‌గుల్ మార్గంలో 148, తొర్రూరు–నాగార్జునసాగర్ రోడ్డులో 135 ఆస్తులు ప్రభావితం కానుండటంతో భూసేకరణ ప్రక్రియ కీలకంగా మారనుంది.
మిస్సింగ్ లింక్‌లకు మోక్షం
శివార్లలో కొత్త రోడ్లకు రంగం సిద్ధం
కసరత్తు చేపట్టిన జీహెచ్‌ఎంసీ


