కొందుర్గు: అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి విద్యార్థిగా మారి పిల్లల మధ్య కూర్చుని ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విన్నారు. జిల్లేడ్ చౌదరిగూడ మండలంలో మంగళవారం ఆమె పర్యటించారు. చౌదరిగూడ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. ఐదో తరగతి గదిలో కూర్చొని ఉపాధ్యాయురాలు లీలామోహన్‌నాయక్ బోధించిన తెలుగు, మహేశ్ బోధించిన ఆంగ్లం పాఠాలు విన్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం కృషిచేస్తున్న తీరును విద్యార్థులకు వివరించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి ప్రజలకు అందిస్తున్న పథకాలపై సమీక్షించారు. ఆరోగ్య ఉపకేంద్రంలో ఆశా కార్యకర్తలతో మాట్లాడారు. ఆ తర్వాత ఇంద్రానగర్‌లో ఏర్పాటుచేసిన వీబీజీరామ్‌జీ గ్రామసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. కూలీలకు ఉపాధిహామీ పథకాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలు చేసిందన్నారు. ఈ పథకం ద్వారా కూలీలకు 125 పనిదినాలు, 318 రకాల పనులు చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. గ్రామసభల్లో చర్చించి ప్రాధాన్యతా క్రమంలో ప్రణాళికలు చేసుకొని అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వర్, ఎంపీడీఓ పుష్పలత, ఎంఈఓ కిరణ్‌కుమార్ రెడ్డి, ఎంపీఓ హన్మంతు రెడ్డి, ఏపీడీ చరణ్‌గౌతమ్, ఏపీఓ నర్సింగ్‌రావు, ఏపీఎం హరిలాల్, ఏఈ వంశీ, ఇంద్రానగర్ సర్పంచ్ మహబూబ్‌బీ, హెచ్‌ఎం సునీత పాల్గొన్నారు.


