నింగినంటిన నిత్యావసరాలు అంతకంతకూ పెరుగుతున్న రేట్లు వరుస పండుగల వేళ వంటింట్లో సంక్షోభం కొనలేం బాబోయ్ అంటున్న సామాన్య, మధ్యతరగతి వర్గాలు
హుడాకాంప్లెక్స్: ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు’ అనే పాట మళ్లీ మార్కెట్లో మార్మోగుతోంది. శ్రావణమాసం, వరలక్ష్మీ వత్రాలు, రాఖీ పౌర్ణమి, వినాయకచవితి, దసర, దీపావళి వరుస పండగుల వేళ నిత్యావసరాల ధరలు భగ్గున మండుతున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న రేట్లతో సాధారణ, మధ్య తరగతి, పేద ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ధరలకు దీటుగా రోజువారీ ఆదాయం పెరగక పోవడంతో సరుకులు కొనేందుకు జంకుతున్నారు.
ఆకాశాన్నంటుతున్న ధరలు
నిన్న మొన్నటి వరకు కిలో రూ.45కే లభించిన చక్కర రూ.65 ఖర్చు చేస్తే కానీ దొరకడం లేదు. జూలై వరకు కేజీ రూ.120కే లభించిన వేరుశనగలకు ప్రస్తుతం రూ.160 వెచ్చించాల్సి వస్తోంది. రూ.45 నుంచి రూ.50 మధ్యన లభించిన బియ్యం రకాన్ని బట్టి ఏకంగా రూ.60 నుంచి రూ.70కి చేరింది. కందిపప్పు రూ.120 నుంచి రూ.134, రూ.100 కే లభించిన పెసరపప్పు రూ.120, మినప పప్పు రూ.130 నుంచి రూ.150కి పెరిగాయి. ఎల్లిగడ్డ రూ.250 నుంచి రూ.350కి, అల్లం రూ.120 నుంచి రూ.200కు ఎగబాకాయి. ఉల్లిగడ్డ కిలో రూ.20 నుంచి రూ.50కి, కొబ్బరికాయ ఒక్కోటి రూ.30 నుంచి రూ.50కి చేరాయి. ఎండుమిర్చి రూ.180 నుంచి రూ.270కి, కారంపొడి రూ.290 నుంచి ఏకంగా రూ.450కి పెరిగాయి.
కాగుతున్న నూనెల ధరలు
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే ఆయిల్ ధరలు అమాంతం పెరిగాయి. సాధారణంగా పల్లి నూనెతో పోలిస్తే సన్‌ఫ్లవర్ ఆయిల్ తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వీటి మధ్య భారీ వ్యత్యాసం నమోదైంది. వేరు శనగనూనె రూ.170 నుంచి రూ.190కి చేరగా సన్‌ఫ్లవర్ రూ.160 నుంచి రూ.200కి పెరిగింది. రైస్‌బ్రాన్ ఆయిల్ రూ.120 నుంచి రూ.150కి చేరింది. పెరిగిన ధరలతో మెజార్టీ గృహిణులు పండుగల వేళ ఇంట్లో పిండివంటలు చేసేందుకు వెనుకాడుతున్నారు. దేవుడి పూజలో ఉపయోగించే నూనె ధరల్లోనూ భారీ పెరుగుదల నమోదైంది.
పండ్లు, పూలకు రెక్కలు
సాధారణ రోజులతో పోలిస్తే పండుగల వేళ పూలు, పండ్లు ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. నిన్న మొన్నటి వరకు కేజీ రూ.200 లోపే లభించిన గులాబీ, చామంతి పూలకు ప్రస్తుతం రూ.400 వెచ్చించాల్సి వస్తోంది. మూరెడు మల్లెపూలు ఏకంగా రూ.50కి చేరాయి. ఇక పండ్ల ధరలకు పొంతనే ఉండటం లేదు. అరటి డజన్ ధర సైజును బట్టి రూ.60 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. నారింజ పండ్లు కేజీ రూ.150, బత్తాయి ఒకటి రూ.15, డ్రాగన్ ఫ్రూట్ రూ.50–60, యాపిల్ కిలో రూ.200 చొప్పున అమ్ముతున్నారు. పూజకు ఐదారురకాల పండ్లు తీసు‘కొనే’వారు.. రెండు మూడు రకాలతో సరిపెట్టుకుంటున్నారు.
చికెన్ ప్రియులకూ ధరల మంట
శాఖాహారులకే కాదు మాంసం ప్రియులకు కూడా ధరల ఘాటు తప్పడం లేదు. గత ఏడాది ఇదే సమయంలో చికెన్ కేజీ రూ.200 లోపు ఉండగా,ప్రస్తు తం రూ.300 వెచ్చిస్తేనే కానీ దొరకడం లేదు. నిన్న మొన్నటి వరకు రూ.5కే లభించిన కొత్తిమీర, పుదీన కట్ట ప్రస్తుతం రూ.12కు చేరాయి. మార్కెట్లో ఏ కూ రగాయ చూసినా కేజీ ధర రూ.60కి తక్కువ లేదు.
తీపిని పంచాల్సిన చక్కెర ధర చేదెక్కింది.. అల్లం, వెల్లుల్లి, ఉల్లి రేట్లు కన్నీరు పెట్టిస్తున్నా యి.. ఎండుమిర్చి ఘాటు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.. నూనెలు సలసల మసలుతున్నాయి.. ఉప్పు, పప్పు.. కూరగాయలు, పండ్లు, పూలు.. ఇలా ఒకటేమిటి నిత్యావసరాల ధరలు ఏవైనా చుక్కలు చూపిస్తున్నాయి.. సామన్యుడికి అందమంటూ కొండెక్కి కూర్చున్నాయి.
ఆర్థికంగా ఇబ్బంది
మార్కెట్లో ఏ వస్తువు కొనాలన్నా భారీగా వెచ్చించాల్సి వస్తోంది. ధరలు పెరిగినంతగా జీతాలు పెరగలేదు. అరకొర వేతనంతో నెట్టుకొస్తున్నాం. ఇంటి అద్దెలు, పిల్లల స్కూలు ఫీజులు రెట్టింపయ్యాయి. దీనికి తోడు నిత్యావసరాల ధరలు అమాంతం పెరగడంతో ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ధరలను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
– దామోదర్, ప్రైవేటు ఉద్యోగి
పండుగల వేళ పరేషాన్
ఏదైనా పండుగ వచ్చిందంటే ఎవరైనా సంతోషిస్తారు. కానీ ప్రస్తుతం పెరిగిన నిత్యావసరాల ధరలను చూస్తే భయం వేస్తోంది. పండ్లు, పూలు, కొబ్బరి కాయలకు ఖర్చు చేయాలి వస్తోంది. బియ్యం, పప్పు, ఆయిల్ ఇలా ఏది కొనాలతో చేతి చమురు వదులుతోంది. ధరలు ఇలాగే పెరుగుతూ పోతే ప్రస్తుతం వంటింట్లో మొదలైన ఆర్థిక సంక్షోభం తర్వాత అన్ని రంగాలకు విస్తరిస్తుంది.
– జి.అనూష, గృహిణి


