గోల్కొండ: గోల్కొండ అట్టారా సిడీ వద్ద గురువారం రాత్రి ఓ సొరంగం బయటపడినట్లు వార్తలు వచ్చాయి. ఈ మేరకు శుక్రవారం రోజంతా సొరంగం చూసేందుకు జనం, అధికారులు తరలివచ్చారు. ఈ సొరంగం చార్మినార్ వరకు ఉండవచ్చని కూడా వదంతులు విన్పించాయి. ఈ నేపథ్యంలో దీనిపై చర్చోపచర్చలు జరగ్గా.. చివరకు అది సొరంగం కాదని, వంద మీటర్ల పరిధిలో ఉన్న ఓ గుంత లాంటి చాంబర్ అని కేంద్ర పురాతత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు గోల్కొండ కోట సీనియర్ పరిరక్షణ అధికారి మల్లేషం శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. గోల్కొండ అట్టారా సిడీలో ఆర్టిలరీ సెంటర్‌కు చెందిన వారు తవ్వకాలు జరుపుతుండగా ఇది వెలుగు చూసిందని, చాంబర్ వంద మీటర్ల పరిధిలో ఉందని తెలిపారు. శుక్రవారం సొరంగ మార్గం విషయం వెల్లడికాగానే తాము ఆర్కియాలజిస్టు, ఇంజనీర్, సర్వేయర్‌తో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించామన్నారు. తమ పరిశీలనలో ఇది సొరంగ మార్గం కాదని రెక్టాంగ్యులర్ షేప్‌లో ఉన్న చాంబర్‌గా తేలిందన్నారు. 1.2 ఇంటూ 1.8 మీటరు వైశాల్యం గల ఈ చాంబర్ పూర్తిగా గ్రానైట్ స్టోన్‌తో నిర్మించి ఉందని తెలిపారు. ఇది మధ్యయుగం కాలానికి చెందినదిగా భావిస్తున్నామన్నారు. ఈ చాంబర్ దేనికి వాడారో ప్రస్తుతానికి చెప్పలేమని, తాము కేంద్ర పురాతత్వ శాఖ డైరెక్టర్ జనరల్‌కు నివేదిక పంపామని పేర్కొన్నారు. పూర్తి నివేదిక అందే వరకు ఎలాంటి తవ్వకాలు చేయొద్దని గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ వారికి స్పష్టంగా తెలిపామన్నారు.


