మీర్‌పేట: జీవో నం.97ను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యను సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల రాఘవేందర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. జీవోను వ్యతిరేకిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో శుక్రవారం మీర్‌పేట టీకేఆర్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద జరిగిన ‘రిజెక్ట్ శక్తి స్కీమ్– సేవ్ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యను శక్తి స్కిల్, హ్యూమన్ క్యాపిటల్, నాలెడ్జ్ ట్రైనింగ్ ఇంటివేటివ్స్ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడం, పాలిటెక్నిక్ కాలేజీలను ఐటీఐలు, ఇతర శిక్షణా సంస్థలతో అనుసంధానం చేయడాన్ని విద్యార్థులు, అధ్యాపకులు, అన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో పాలిటెక్నిక్ విద్యకు ఉన్న గుర్తింపు దెబ్బతినే ప్రమాదముందని, సాంకేతిక విద్యను సాధారణ నైపుణ్య శిక్షణతో కలపడంతో విద్యార్థుల ఉపాధి అవకాశాలు తగ్గే ప్రమాదముందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోరెడ్డి నితిన్, దాసి పవన్, జేడీ పవన్, హరేకృష్ణ, గుర్రం సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.


