యాచారం: తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారుల ఆరా తీసినట్లు తెలిసింది. బుధవారం ‘సాక్షి’దినపత్రికలో ‘సమస్యల తహసీల్!’కథనంపై జిల్లా వ్యాప్తంగా చర్చ సాగింది. తహసీల్దార్ అయ్యప్ప, ఇతర అధికారులపై ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధుల ఫిర్యాదులపై కలెక్టర్ నారాయణరెడ్డి ఆరా తీసినట్లు సమాచారం. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వరుస ఫిర్యాదుల నేపథ్యంలో యాచారం తహసీల్దార్ అయ్యప్పను తక్షణమే సెలవులో వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. ఉన్నతాధికారులకు సంజాయిషీ ఇచ్చుకునేందుకు వెళ్లిన తహసీల్దార్ మధ్యాహ్నం తర్వాత కార్యాలయానికి విచ్చేసి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించారు.
● 22 తులాల బంగారు ఆభరణాలు, రూ. 1.80 లక్షల నగదు మాయం
మలక్‌పేట: అగంతకులు ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారు. బుధవారం మలక్‌పేట అడిషనల్ ఇన్‌స్పెక్టర్ గిరి తెలిపిన మేరకు.. మహమ్మద్ మొహియుద్దీన్ కుటుంబంతో కలిసి ఈ నెల 25న చైన్నెకు వెళ్లారు. బుధవారం తిరిగి రాగా బీరువాలో దాచిన 22 తులాల బంగారు ఆభరణాలు, రూ. 1.80 లక్షలు మాయమైనట్లు గమనించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా మూసారంబాగ్‌లోని ఏలియన్ హోలీ బట్టల దుకాణంలో బుధవారం తెల్లవారుజామున దొంగలు షట్టర్ తెరిచి రూ. 22,000 విలువైన బట్టలు,పక్కనే ఉన్న వాచ్ షోరూమ్‌లో రూ.1.50 లక్షల విలువైన 6 గడియాలు ఫిర్యాదు చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉద్యోగం పేరుతో మోసం
నగ్న వీడియో కాల్స్ చేయించి
బ్లాక్‌మెయిల్
ఫిలింనగర్: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ యువతితో నగ్న వీడియో కాల్స్ చేయించి,రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరించిన వ్యక్తిపై ఫిలింనగర్ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. వరంగల్ జిల్లా నెల్లికుదురుకు చెందిన మహిళకు విజయరామరాజు ఉద్యోగం కల్పిస్తానని నమ్మించాడు. ఆ తర్వాత నగ్న వీడియో కాల్స్ చేయించి రికార్డు చేశాడు. అనంతరం వాటిని బహిర్గతం చేస్తానంటూ బెదిరిస్తూ వేధిస్తుండటంతో బాధితురాలు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన మహేశ్వరం పరిధిలో జరగడంతో ఫిలింనగర్ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.


