కార్మిక వ్యతిరేక విధానాలు తగవు | - | Sakshi
Sakshi News home page

కార్మిక వ్యతిరేక విధానాలు తగవు

Aug 3 2026 9:13 AM | Updated on Aug 3 2026 9:13 AM

తుక్కుగూడ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. పట్టణ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఏఐటీయూసీ జిల్లా 4వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్‌లు తీసుకువచ్చి పూర్తిగా కాలరాసిందని విమర్శించారు. దేశంలో మోదీ ప్రభుత్వం రైతులు, విద్యార్థులు, యువత ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వారి తీరు కారణంగానే ఢిల్లీలో గతంలో రైతులు ఉద్యమం చేపట్టారని, నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహరంపై జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారని గుర్తు చేశారు. ఈ పోరాటాలన్నీ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. కనీస వేతనాల అమలు, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. దేశంలో కార్మికుల చట్టాల అమలు కోసం పార్టీలు, కార్మిక, రైతు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్‌ యూసఫ్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, నాయకులు పానుగంటి పర్వతాలు, రామస్వామి, దత్తునాయక్‌, శేఖర్‌రెడ్డి, చందు యాదవ్‌, రాజు, లక్ష్మణ్‌, నర్సింహారెడ్డి, దేవేందర్‌గౌడ్‌, బ్రహ్మచారి, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement