నవజాత శిశు మరణాల రేటు తగ్గింపే లక్ష్యం
● ఆదిలాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు విజయవంతం
● నగరంలో అమలుకు అధికారుల సన్నాహాలు
సాక్షి, సిటీబ్యూరో: నవజాత శిశు మరణాల రేటును సింగిల్ డిజిట్‌కు తగ్గించేందుకు ప్రభుత్వం గట్టి ‘సంకల్పం’తో ముందుకెళుతోంది. దంపతులు పిల్లల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకున్నప్పటి నుంచి ప్రసవమై తల్లీ, బిడ్డ క్షేమంగా ఇంటికి వెళ్లేంత వరకు ఒక నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టి పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో అదే తరహాలో నగరంలోనూ అమలుకు వైద్యారోగ్యశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
వెయ్యి జననాల్లో 12.27 మృతుల రేటు
హైదరాబాద్ జిల్లాలో ప్రతి వెయ్యి మంది పిల్లల సజీవ జననాల్లో పుట్టిన 28 రోజుల్లోపు 12.27 మంది మృతుల రేటు నమోదవుతోంది. నగరంలోని నవ దంపతులు ఫెర్టిలిటీ సమస్యలతో బాధపడు తున్న తరుణంలో పుట్టిన బిడ్డను రక్షించుకోవడమూ కీలకంగా మారుతోంది. నవజాత శిశు మరణాల రేటును 5 శాతం కంటే దిగువకు తీసుకురావా లని హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికా రులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి క్షేత్ర స్థాయిలో ఆశా కార్యకర్త నుంచి మొదలు పెడితే బిడ్డను ప్రసవం చేసిన నిపుణులైన వైద్యుల బృందం వరకు అందరినీ ఒక లక్ష్యం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టిన 28 రోజుల వరకు ప్రతి తల్లీబిడ్డను 360 డిగ్రీల కోణంలో పర్యవేక్షించనున్నారు.
ఏటా 1.20 లక్షల జననాలు
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో విస్తరించిన గ్రేటర్ పరిధిలో ఏటా సుమారు 1.20 లక్షల జననాలు నమోదవుతున్నాయి. ఇందులో హైదరాబాద్ జిల్లాలోనే సుమారు 75 వేలకుపైగా ఉంటున్నాయి. హైదరాబాద్‌లో గాంధీ, పేట్లబురుజు, నిమ్స్ వంటి ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కార్పొరేట్ ఆసుపత్రులు అందు బాటులో ఉన్నప్పటికీ నవజాత శిశు మరణాల రేటు ఆందోళణకు గురిచేస్తోంది.
ఏం చేయనున్నారు?
ఆశా కార్యకర్త గర్భిణితో నిత్యం టచ్‌లో ఉంటుంది. వారంలో కనీసం ఒక్కసారి అయినా గర్భిణి ఇంటికి వెళ్లి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తారు. హైరిస్క్ కేసుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. గర్భిణి డేటా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. నెలలు నిండిన గర్భిణి ముందస్తుగా ఆసుపత్రికి చేర్చడం, వీలైనంత వరకు సాధారణ ప్రసవానికి ప్రయత్నించాలని అధికారులు చెబుతున్నారు. శిశువు తక్కువ బరువుతో పుడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇన్ఫెక్షన్లను నుంచి రక్షించుకునేందుకు మదర్ కేర్‌లో శిక్షణ ఇస్తారు. ఫలితంగా ఇన్ఫెక్షన్లు 60 శాతం వరకు తగ్గుతాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. పుట్టిన గంటలోపు బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు తాగించాలని చెబుతున్నారు.
సంవత్సరం ప్రసవాలు మృతులు
2024-25 76,709 866
2025-26 75,804 868
2026-27 16,047 197
(ఏప్రిల్ నుంచి జూన్ వరకు)


