గుంటల్లో రిజిస్ట్రేషన్లు నిలిపేశాం
యాచారం: ఫ్యూచర్‌సిటీలో ఫాంల్యాండ్స్ దందా జోరుగా సాగుతోంది. లాభార్జనే లక్ష్యంగా రియల్ వ్యాపారులు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మండలంలోని 24 పంచాయతీలు ఫ్యూచర్‌సిటీ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ఏర్పాటయ్యే వెంచర్లకు ఎఫ్‌సీడీఏ (ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ) అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అనుమతులకు భారీగా ఖర్చవుతుందనే ఉద్దేశంతో వ్యాపారులు అక్రమ మార్గాన్ని అలవాటు చేసుకుంటున్నారు. ఫాంల్యాండ్స్ వ్యాపారం కొనసాగిస్తున్నారు. చౌదర్‌పల్లి, నందివనపర్తి, యాచారం, తక్కళ్లపల్లి, కొత్తపల్లి, మాల్, గునుగల్, చింతపట్ల, నస్దిక్‌సింగారం, అయ్యవారిగూడెం తదితర గ్రామాల్లో ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ.కోటికి పైగా కొనుగోలు చేసి గుంటల్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పైగా విక్రయిస్తున్నారు.
ఇటీవల ఎమ్మెల్యే ఆగ్రహం
రియల్ వ్యాపారులు కొనుగోలుదారులకు గుంటల్లో నే విక్రయాలు జరుపుతున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఫాంల్యాండ్స్ కోసం గుంటల్లో రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. నిత్యం 25 నుంచి 50 వరకు 121, 242, 363, 400, 500 గజాల్లో వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. వీటికోసం రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఫాంల్యాండ్స్‌కు గుంటల్లో వ్యవసాయ భూముల విక్రయాలపై ఇటీవల జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి రెవెన్యూ అధికారులపై మండిపడిన విషయం తెలిసిందే. ఏఏ గ్రామాల్లో గుంటల్లో వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్లు చేస్తున్నారో నివేదిక ఇవ్వాలని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు.
ఫాంల్యాండ్స్ పేరిట అక్రమార్కుల వ్యాపారం
వ్యవసాయ పొలాలను చూపించి గుంటల్లో విక్రయాలు
సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం
తహసీల్దార్ కార్యాలయంలో జోరుగా రిజిస్ట్రేషన్లు
రూ.లక్షల్లో కొనుగోలు చేసి రూ.కోట్లలో ఆర్జన
గుంటల్లో రిజిస్ట్రేషన్లపై ఉన్నతాధికారుల ఆరా?
ఫాంలాండ్స్ పేరుతో వ్యవసాయ భూములను గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేయడం నిలిపేశాం. నిజమైన రైతులకు అత్యవసరమనుకుంటే జీపీఓల ద్వారా వివరాలు సేకరించి రిజిస్ట్రేషన్లు చేసేలా తహసీల్దార్లకు సూచించాను. ఎఫ్‌సీడీఏ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన వెంచర్లలోనే ప్లాట్లు కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
– శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం


