● ఎక్కడ ఏర్పాటైనా ధ్వంసం చేయండి
● బాధ్యులపై చర్యలు తీసుకోండి
● పంచాయతీ అధికారులను ఆదేశించిన డీపీఓ
యాచారం: జిల్లాలో ఏ గ్రామంలో అక్రమంగా ఫాంల్యాండ్స్ ఏర్పాటు చేసినా తక్షణమే ధ్వంసం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌మోహన్ వివిధ మండలాల పంచాయతీ అధికారులను ఆదేశించారు. ‘ఫ్యూచర్‌సిటీలో రియల్ దందా’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. యాచారం, కందుకూరుతోపాటు ఆయా మండలాల పంచాయతీ అధికారులకు నేరుగా ఫోన్లు చేసి ఫ్యూచర్‌సిటీ పరిధిలోని మండలాల్లో ఫాంల్యాండ్స్ పేరుతో దందా చేస్తే చూస్తూ ఊరుకోవద్దని సూచించారు. వెంటనే ఫాంల్యాండ్స్ వ్యవసాయ భూములను గుర్తించి, అందులో వేసిన రోడ్లను ధ్వంసం చేసి, హద్దురాళ్లను తొలగించాలని ఆదేశించారు. బాధ్యులైన వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు ఫాంల్యాండ్స్‌కు వ్యవసాయ భూములను గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేసే తహసీల్దార్లపై కలెక్టర్ నారాయణరెడ్డి ఆరా తీసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల ఫిర్యాదుల నేపథ్యంలో ఆయా డివిజన్ల ఆర్డీఓలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
కొత్తూరు: పట్టణంలోని లిటిల్ ఎంజిల్స్ పాఠశాలలో సోమవారం రాష్ట్రస్థాయి జూనియర్ అంతర్‌జిల్లా చౌక్‌బాల్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఇందులో భాగంగా సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభ కనచ్చారు. రాష్ట్రస్థాయిలో రంగారెడ్డి జిల్లా జట్టు విజేతగా నిలవగా, ద్వితీయ స్థానంలో నిజామాబాద్, తృతీయ స్థానంలో మహబూబ్‌నగర్ జిల్లా జట్లు నిలిచినట్లు నిర్వాహకుడు వెంకటేశ్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చిన జట్లు అస్సాంలో అక్టోబర్ 7 నుంచి 10వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.
షాద్‌నగర్: ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా షాద్‌నగర్ పట్టణానికి చెందిన నీల రవీందర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు గందె సురేష్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్య సంఘం యువతను సంఘటితం చేస్తూ, సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు ఎల్కుర్తి నారాయణ, నాయకులు మురళీధర్, పెండ్యాల జగదీశ్వర్, విజయ్‌కుమార్, యశ్వంత్ రాజ్, ఆంజనేయులు, ఆనంద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
కేశంపేట: గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘం (ఏఐటీయూసీ) రాష్ట్ర కోశాధికారిగా మండల కేంద్రానికి చెందిన ఆదిరాల రాంచంద్రయ్య ఎంపికయ్యారు. గత నెల 26న ఖమ్మం జిల్లా రఘనాథపాలెంలో పంచాయతీ వర్కర్స్ సంఘం రాష్ట్రస్థాయి 3వ మహాసభలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో సంఘం రాష్ట్ర కోశాధికారిగా కేశంపేట పంచాయతీలో విధులు నిర్వర్తిస్తున్న రాంచంద్రయ్యను ఎంపిక చేస్తూ తీర్మానం చేశారు. రాష్ట్ర కమిటీ నుంచి రాంచంద్రయ్య సోమవారం నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.


