ఇబ్రహీంపట్నం రూరల్: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు, కూరగాయల సాగు చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో సాగు మార్గదర్శక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరికి బదులు ఆయిల్‌పామ్, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే విధంగా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు ఎంపిక చేసుకోవా లని తెలిపారు. నిపుణుల కమిటీ రూపొందించిన మార్గదర్శక పుస్తకం రైతులకు శాసీ్త్రయ సాగు విధానాలపై అవగాహన కల్పించి, మెరుగైన దిగుబడులు సాధించడానికి దోహదపడుతుందని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ మార్గదర్శకాలను రైతులకు విస్తృతంగా చేరవేసి, అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని ఆదేశించారు.
ప్రజావాణికి 120 ఫిర్యాదులు
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలన్నారు. ఈ వారం ప్రజావాణికి 102 ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, జిల్లా రెవెన్యూ అధికారి శారద తదితరులు పాల్గొన్నారు.
తల్లిపాల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్‌ను కలెక్టరేట్‌లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శిశువు పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ఈ ఏడాది తల్లిపాలకు ప్రాధాన్యత ఇద్దాం.. సుస్థిరమైన సహాయ వ్యవస్థలను ఏర్పాటు చేద్దాం అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చేర్చేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్మయి, జిల్లా సంక్షేమ అధికారి శాంతిశ్రీ, జిల్లా వైద్యాధికారి స్వర్ణలత, ఏఓ సునీల్, సీడీపీఓలు, డీహెచ్‌ఈడబ్ల్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి


